ఆదిదంపతుల అనుగ్రహం

సిరియాళుడు నిరంతరం శివుడి గురించిన ఆలోచనచేస్తూ ఉండేవాడు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మేయగా వచ్చిన ధనంతో తన కుటుంబ జీవితాన్ని కొనసాగించేవాడు. ఒకవైపు పేదరికం బాధిస్తున్నా ఆయన మాత్రం అదో కష్టంగా భావించేవాడు కాదు. అంత పేదరికంలోనూ ఆయన తనకి తోచిన సాయంచేస్తూ ఉండేవాడు. ఆయన వ్యవహార శైలిపట్ల భార్య ఎప్పుడూ అసహనాన్ని ... అసంతృప్తిని వ్యక్తం చేసేది కాదు. ఆయనతోపాటే పస్తులు వుండేది ... ఆయనతోపాటే భజనలు చేసేది.

అలాంటి పరిస్థితుల్లో శివపార్వతులు మారువేషాల్లో వారి ఇంటికి అతిథులుగా వచ్చారు. తాము నిరుపేదలమనీ ... ఆ పూటకి శివుడికి ఆకులు అలములు మాత్రమే నైవేద్యంగా పెట్టినట్టు చెప్పాడు సిరియాళుడు. వాటినే తమకి వడ్డించమని ఆ దంపతులు అనడంతో సిరియాళుడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఆదేశం మేరకు భార్య ఆ దంపతులకు ఆకులను వడ్డించింది. వాటిని ఆ దంపతులు ఆనందంగా స్వీకరించి, సంతృప్తితో సిరియాళుడునీ ఆయన భార్యని ఆశీర్వదించి వెళ్లిపోయారు.

ఆదిదంపతుల అనుగ్రహం కారణంగా సిరియాళుడు ఏది కోరుకుంటే అది జరిగిపోయేది. అయితే ఈ శక్తిని ఆయన ఎప్పుడూ తన కోసం వినియోగించలేదు. దీనులను ఉద్ధరించడం కోసం ... వారిని వివిధ సమస్యల నుంచి బయటపడేయడానికి మాత్రమే వినియోగించాడు. దాంతో ఊళ్లోని వారంతా శిరియాళుడిని ఎంతగానో అభిమానించేవారు. ఇది సహించలేకపోయిన గ్రామపెద్దలు సిరియాళుడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఓ రాత్రివేళ సిరియాళుడు ... ఆయన భార్య నిద్రిస్తూవుండగా ఆ గుడిసెకి నిప్పుపెట్టారు. మరునాడు ఉదయం ఆ సంఘటన గురించి ఎవరూ మాట్లాడుకోకపోవడం గ్రామపెద్దలకు సందేహాన్ని కలిగించింది. వాళ్లు సిరియాళుడు ఇంటి దగ్గరికి వెళ్లగా, అక్కడ గుడిసె స్థానంలో అందమైన భవనం వుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ భవనంలో సిరియాళుడు ... భార్య సంతోషంగా వుండటం చూసి బిత్తరపోయారు. సిరియాళుడు ఆయన భార్య మాత్రం తమని ఆపద నుంచి గట్టెక్కించిన శివుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనను మరింత భక్తి శ్రద్ధలతో పూజించసాగారు.


More Bhakti News