శ్రీ లలితాంబికా క్షేత్రం

ప్రశాంతమైన వాతావరణంలో విశిష్టతకు ప్రతీకగా విలసిల్లుతోన్న క్షేత్రాలలో శ్రీ లలితాంబికా క్షేత్రం ఒకటిగా కనిపిస్తుంది. అత్యంత శక్తిమంతమైనదిగా అలరారుతోన్న ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా లోని జడ్చర్లకు సమీపంలోగల 'గొల్లపల్లి' లో దర్శనమిస్తుంది. అమ్మవారి ఉపాసకుడైన శ్రీ మలయాళ స్వాములవారు అత్యంత నియమనిష్టలతో ... భక్తి శ్రద్ధలతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు చెబుతారు.

సువిశాలమైన ప్రదేశంలో 'శ్రీ చక్రమేరు' ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం, భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ధ్యానంలో వున్న మహాశివుడి ప్రతిమ దర్శనమిస్తుంది. మనసు దోచుకునేలా వున్న ఈ మహాశివుడు దగ్గర నుంచి ఎవరికైనా సరే వెంటనే కదలబుద్ధి కాదు. సుందరమైన శిల్పకళా కృతులతో తీర్చిదిద్దబడిన రాజగోపురం దాటి లోపలికి అడుగుపెడితే, మనోహరమైన ముఖమంటపం కనిపిస్తుంది.

గర్భాలయంలో శ్రీ లలితాంబికాదేవి దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ వుంటుంది. అమ్మవారి చూపులో ప్రేమ .. జాలి .. కరుణ .. కలిసికట్టుగా కనిపిస్తూ వుంటాయి. భక్తులు అమ్మవారికి ఎక్కువగా నిమ్మకాయల దండలు సమర్పిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహం కారణంగానే తమ ఆపదలు ... ఆవేదనలు తొలగిపోతాయని బలంగా విశ్వసిస్తూ వుంటారు. ఇక క్రింది అంతస్తులో శిలా రూపంలోని 'శ్రీ చక్రమేరు' అయిదున్నర అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది.

శ్రీ చక్రమేరుకు భక్తులు విశేషంగా పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. ప్రతి శుక్రవారంతో పాటు, విశేషమైన పర్వదినాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు, ప్రాంగణంలో కొలువైన మురళీ కృష్ణుడు ... హనుమంతుడు ... శిరిడీ సాయిబాబా ... మలయాళ స్వామి ... నవగ్రహాల మందిరాలను కూడా దర్శించి తరిస్తుంటారు.


More Bhakti News