శ్రీ గోవిందరాజ స్వామి క్షేత్రం

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులు, తిరుపతిలో దిగగానే గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన రాజగోపురం ఆహ్వానం పలుకుతూ కనిపిస్తుంది. 16వ శతాబ్దం తొలినాళ్లలో నిర్మించబడిన ఈ రాజగోపురం ప్రాచీన వైభవాన్ని ఆధ్యాత్మిక పరిమళంతో కలిపి ఆవిష్కరిస్తూ వుంటుంది. ముందుగా గోవిందరాజస్వామిని దర్శించుకుని, ఆ తరువాత మెట్ల దారిలో శ్రీవారి చెంతకు చేరుకోవాలనే సంకల్పంతోనే ఎక్కువమంది భక్తులు వస్తుంటారు.

ప్రధాన ఆలయం అనేక ఉపాలయాలను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ రామానుజా చార్యుల వారికి చెందుతుందని స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. గర్భాలయంలో స్వామివారి విగ్రహం, 'కుంచం' వంటి కొలత పాత్రపై తల వుంచి అలసట తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంటుంది. నిండుగా ... నిర్మలంగా దర్శనమిచ్చే స్వామివారిని చూడగానే, ఆయనను కొండంత దేవుడిగా ... జగన్మోహనుడిగా ఎందుకు కొలుస్తారనేది అర్థమైపోతుంది.

పద్మావతీదేవితో కల్యాణం నిమిత్తం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న శ్రీనివాసుడు, ఆలయానికి వచ్చిన ఆదాయంతో వడ్డీతో సహా తీరుస్తానని కుబేరుడికి మాటయిస్తాడు. అలా వచ్చిన ఆదాయాన్ని కుంచం వంటి పాత్రతో కొలుస్తూ స్వామి అలసిపోయి ఇలా విశ్రమించాడని చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీదేవితో పాటుగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ... పార్థసారధి ... వ్యాసరాయ ఆంజనేయ స్వామి ... ఆళ్వారులు పూజలు అందుకుంటూ వుంటారు. ఈ క్రమంలోనే తిరుమల నంబి ... రామానుజా చార్యుల వారి మందిరాలు కూడా కనిపిస్తాయి.

ప్రతి నిత్యం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగానే వుంటుంది కనుక, తిరుపతిలోని ఈ ఆలయం కూడా ఎప్పుడూ రద్దీగా వుంటుంది. గోవిందరాజస్వామి మనోహరమైన రూపాన్ని హృదయంపై ముద్రించుకుని, ఆ అనుభూతి అలలపై తేలియాడుతూ భక్తులు సునాయాసంగా తిరుమల చేరుకుంటారు.


More Bhakti News