తుంబూరు

దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ నిమిత్తం వివిధ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు, తన భక్తుల అభ్యర్ధన మేరకు చెన్నకేశవ స్వామిగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలా ఆయన కొలువుదీరిన క్షేత్రాలలో ఒకటిగా 'తుంబూరు' కనిపిస్తుంది. ప్రాచీనకాలం నాటి ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా 'సత్తుపల్లి' మండలంలో విరాజిల్లుతోంది.

పూర్వకాలంలో 'తుంబురుడు' శ్రీమహావిష్ణువు గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేసిన కారణంగా ఈ ఊరుకి 'తుంబూరు' అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. ఇక్కడి స్థల ప్రాశస్త్యం గురించి తెలుసుకున్న 'రెడ్డి రాజులు' ... 13 - 14 శతాబ్దాల మధ్యకాలంలో తమ కోట లోపలి భాగంలో చెన్నకేశవ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇక్కడి చెన్నకేశవస్వామి విగ్రహం సాలగ్రామ శిలతో మలచబడి, 'ర్యాలి' జగన్నాథస్వామిని పోలి వుండటం విశేషం.

గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి - భూదేవి సమేతంగా దర్శనమిస్తూ వుంటాడు. రెడ్డిరాజులు తమ విజయాలకు ... ప్రజల సంక్షేమానికి చెన్నకేశవస్వామి అనుగ్రహమే కారణమని భావించే వారు. ఈ కారణంగా ఈ స్వామికి వారు నిత్య పూజాభిషేకాలు నిర్వహించేవారు. ఇక్కడి స్వామి మహా మహిమ కలిగినవాడనీ, నిజమైన భక్తులు ''స్వామి ...'' అని పిలిస్తే, వెంటనే ఆయన ''ఓయ్ ... '' అంటూ పలికేవాడని అంటారు.

రెడ్డిరాజుల తరువాత కోటలోని దేవుడిని దర్శించుకునే అవకాశం ... అదృష్టం ప్రజలకు లభించింది. ఇక్కడి క్షేత్ర విశిష్టత ... స్వామివారి మహిమ గురించి తెలుసుకున్న శ్రీ కృష్ణ దేవరాయలు స్వయంగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. స్వామివారి సౌందర్యానికి ఆయన మంత్రముగ్ధుడయ్యాడని అంటారు.

ఆ కాలంలోనే స్వామివారికి అనంతమైన సంపద ఉండేదని చెబుతారు. మతపరమైన దాడులు జరిగిన నేపథ్యంలో, స్వామివారు సంపదలు కోల్పోయినట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత గుప్తనిధుల కోసం రహస్యంగా జరిపిన తవ్వకాల వలన ఆలయంలోని కొన్ని భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పురాణ పరమైన ప్రాశస్త్యాన్ని .... చారిత్రక పరమైన నేపథ్యాన్ని కలిగి వున్న ఈ క్షేత్రం నేటికి భక్తులపాలిట కొంగుబంగారంగా అలరారుతూనే వుంది. ఇక స్వామివారికి సమీపంగా శివాలయం కూడా వుండటం వలన ఇది హరిహర క్షేత్రంగా కూడా ప్రసిద్ధిచెందింది.

ఇక్కడి కోనేరులో స్నానమాచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. తమ కోరికలను స్వామికి విన్నవించుకుని ... అవి నెరవేరాక మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ప్రతియేటా వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. ఆ స్వామి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.


More Bhakti News