కరుణించిన రాఘవేంద్రుడు

శ్రీ రాఘవేంద్రస్వామి తనని నమ్మిన భక్తులు వివిధరకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు, అనేక మార్గాల్లో వారిని ఆయన ఆదుకోవడం జరిగింది. అలా తన భక్తులను రక్షించిన విధానాలే అయన చూపిన మహిమలుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి వాటిలో ఆశ్చర్యచకితులను చేసే ఓ అరుదైన సంఘటన మనకి కనిపిస్తుంది. కుంభకోణం పరిసరప్రాంతాల్లోని ఓ గ్రామంలో అన్యోన్య దంపతులు వుండేవారు. కాలం అన్ని విషయాల్లోనూ వారికి కఠినమైన పరీక్షలు పెడుతూ ఉండటంతో, ఆ దంపతులు నానాఅవస్థలు పడసాగారు.

అలాంటి పరిస్థితుల్లోనే వారికి శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమలను గురించి తెలిసింది. పక్కనే వున్న గ్రామానికి ఆయన వస్తున్నాడని తెలిసి, ఆ మహనీయుడిని కలిసి తమ బాధలను విన్నవిస్తానని చెప్పి భర్త బయలుదేరాడు. నిండుచూలాలైన భార్య, తాను కూడా స్వామి ఆశీస్సులు తీసుకుంటానని కోరింది. భార్య అంత దూరం నడవలేదని తెలిసినా, బలమైన ఆమె నిర్ణయాన్ని భర్త కాదనలేకపోయాడు. కాలినడకన చాలాదూరం ప్రయాణించి పక్క గ్రామానికి చేరుకున్నారు.

అప్పటికే స్వామి వచ్చి వెళ్లిపోయారని తెలిసి దిగాలుచెందారు. వెనుదిరుగుదామని చెప్పిన భర్తను భార్య వారించింది. రాఘవేంద్ర స్వామి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో తెలుసుకుని ఆ దిశగా నడకమొదలు పెట్టారు. ఆ తరువాత గ్రామంలో కూడా వారికి నిరాశే ఎదురైంది. ఇక అక్కడి నుంచి ముందుకి వెళ్లడం మంచిది కాదనీ, వెనక్కి వెళ్లడం మంచిదని చెప్పాడు భర్త. స్వామి దర్శనం లభించకుండా వెనుదిరిగేదిలేదంటూ ఆమె ముందుకిసాగింది. దాంతో చేసేది లేక ఆమెను అనుసరించాడతను.

అలా ఓ నిర్జన ప్రదేశానికి చేరుకోగానే ఆమెకి నొప్పులు ప్రారంభమయ్యాయి. తాగడానికి నీళ్లు గానీ ... నిలబడటానికి నీడగానిలేని ప్రాంతమది. అలాంటి పరిస్థితుల్లో ఆమె భర్తకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇక రాఘవేంద్ర స్వామియే ఈ గండం నుంచి తన భార్యను కాపాడాలని ఆయన స్వామికి మనసులోనే నమస్కరించుకున్నాడు. అంతే ఒక్కసారిగా సూర్యుడి తీక్షణతను తగ్గిస్తూ మబ్బులు కమ్ముకున్నాయి. ఆమెకి అతి దగ్గరలో ఒక నీటి చెలమ ఏర్పడి దానిలో నుంచి బుడబుడమంటూ నీరు పొంగింది. ఆ నీటితో భర్త ఆమె దాహం తీర్చాడు. ఇంతలో ఓ కాషాయ వస్త్రం గాలికి ఎగురుతూవచ్చి ఆమె చుట్టూ వలయాకారంలో నిలిచింది. ఆ దృశ్యం చూసి భార్యా భర్తలు ఆశ్చర్యపోయారు.

స్వామి అనుగ్రహంతో ఆమెకి సుఖ ప్రసవం జరిగింది. పసిబిడ్డతో వాళ్లు అక్కడి నుంచి బయలుదేరబోతూ, ఎదురుగా వచ్చిన రాఘవేంద్ర స్వామిని చూసి ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ముందుకువెడుతున్న స్వామి హఠాత్తుగా ఆగిపోయి, ఎందుకు వెనుదిరిగి వచ్చాడనేది అప్పుడు గాని ఆయన శిష్యులకు అర్థం కాలేదు. తమ బిడ్డకు స్వామి పేరు పెట్టుకుంటున్నట్టుగా చెప్పి, ఆ దంపతులు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆనాటి నుంచి వారి జీవితం ఎలాంటి లోటు లేకుండా సంతోషకరంగా కొనసాగింది.


More Bhakti News