శ్రీ సీతారామాలయం

శ్రీరాముడిని ఒకసారి చూసినవారు ... ఆయనతో ఒకసారి మాట్లాడినవారు ... కడవరకూ ఆయన పాదాలను ఆశ్రయించి ఉన్నారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సుందరమైన రూపం ... సున్నితమైన మాటతీరు ... ఆచరించిన ధర్మమార్గం ... ప్రదర్శించిన పరాక్రమం ఇవన్నీ కూడా నాటి అయోధ్యావాసులనే కాదు, నేటి భారతదేశంలోని ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఈ కారణంగానే శ్రీరామచంద్రుడు ప్రతి ఊరులోను కొలువైనాడు ... ప్రతి ఇంటా పూజలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీరాముడు సీతా సమేతుడై, లక్ష్మణ - హనుమ సహితంగా ఆవిర్భవించిన క్షేత్రం మనకి నెల్లూరు జిల్లా 'బుచ్చిరెడ్డి పాలెం'లో దర్శనమిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడికి కలలో శ్రీరాముడు కనిపించి, ఇక్కడ తన ఆలయాన్ని నిర్మించవలసిన బాధ్యతని అప్పగించాడు.

స్వామివారి ఆదేశం ప్రకారం ఆ భక్తుడు నిర్మించిన ఆలయం, నేడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై, భక్తులపాలిట కల్పవృక్షమై అలరారుతోంది. విశాలమైన ప్రాంగణం ... పొడవైన ప్రాకారాలు ... శిల్పకళా శోభితమైన ఏడు అంతస్తులుగల రాజగోపురం ... రెండు ఎకరాల విస్తీర్ణంగల కోనేరు ... ఆలయ వైభవానికి నిదర్శనమై నిలుస్తుంటాయి. ఎంతో మంది సంస్థానాధీశులు ఇక్కడి స్వామివారిని దర్శించి, భూరీ విరాళాలు సమర్పించిన ఆధారాలు వున్నాయి.

గర్భాలయంలో స్వామివారికి అమ్మవారు కుడివైపున వుండటం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, శ్రీ మహాలక్ష్మీ దేవి ... గోదాదేవి ... వరదరాజస్వామి ... హనుమంతుడు పూజలు అందుకుంటూ వుంటారు. స్వామివారికి ప్రతియేటా చైత్రమాసంలో తొమ్మిది రోజులపాటు 'బ్రహ్మోత్సవాలు' నిర్వహిస్తూ వుంటారు.

ఈ సందర్భంగా స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇక స్వామివారికి జరిగే రథోత్సవం ... తెప్పోత్సవం చూసి తీరవలసిందే. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. సీతారాముల ఆశీస్సులు అందుకుని ఆనందానుభూతులను సొంతం చేసుకుంటూ వుంటారు.


More Bhakti News