నరశింగోలు

శనీశ్వరుడికి చెందిన క్షేత్రాల్లో ఆయన శిలా రూపంలో గానీ, విగ్రహరూపంలో గాని దర్శనమిస్తుంటాడు. అలా కాకుండా ఆయన శివుడిలా లింగరూపంలో దర్శనమివ్వడం ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేయక మానదు. ప్రకాశం జిల్లా 'నరశింగోలు' గ్రామంలో అడుగుపెడితే ఇలాంటి ఆశ్చర్యమే భక్తులకు కలుగుతుంది. ఇక్కడ శనిదేవుడు వేల సంవత్సరాలకి చెందినవాడుగా లింగరూపంలో కొలువై ఉంటాడు.

శనిదేవుడు ఇక్కడ ఆవిర్భవించడానికి బలమైన కారణమే కనిపిస్తుంది. పూర్వం అగస్త్య మహర్షి శివుడి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకు సంతోషించిన అగస్త్య మహర్షి, గంగా ... పార్వతీ సమేతంగా ఆ ప్రదేశంలో కొలువుదీరమని ప్రార్ధించాడు. ఆయన కోరిక మేరకు శివుడు అలాగే ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడు. ఇక ఈ క్షేత్రంలో శనిదేవుడిని ప్రతిష్ఠిస్తే మంచిదని భావించిన అగస్త్యుడు, ఆయన మూర్తిని లింగ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించి పూజించినట్టు స్థలపురాణం చెబుతోంది.

ఎంతోమంది రాజులు ... చక్రవర్తులు ఈ స్వామిని సేవించి ఆయన తీక్షణత నుంచి బయటపడినట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్ర మహాత్మ్యం గురించిన ప్రస్తావన పురాణాల్లో సైతం కనిపిస్తుంది. కాలక్రమంలో ఆలయాలు శిధిలమైపోగా, చాలాకాలం క్రిందట పునఃనిర్మాణం జరిగింది. పురాణ సంబంధమైన క్షేత్రం కావడంతో, భక్తుల రద్దీ ఎక్కువగానే వుంటుంది. భక్తులు శనీశ్వరుడికి నువ్వులు ... నల్లని వస్త్రాలు ... జిల్లేడు ఆకులు సమర్పిస్తుంటారు.

గర్భాలయలో లింగరూపంలో కొలువైన శనిదేవుడికి నువ్వుల నూనెతో భక్తులు స్వయంగా అభిషేకం చేస్తుంటారు. శనిత్రయోదశి రోజున సామూహికంగా శాంతి హోమాలు నిర్వహిస్తుంటారు. ఇక గంగా .. పార్వతీ సమేత రామలింగేశ్వరుడికి కూడా నిత్య పూజాభిషేకాలు జరుగుతుంటాయి. పర్వదినాల సమయంలో స్వామికి ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుపుతుంటారు.


More Bhakti News