శ్రీ వాసవీమాత క్షేత్రం

శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అంశావతారంగా చెప్పుకునే వాసవీకన్యకాపరమేశ్వరి అమ్మవారు అనేక ప్రాంతాల్లో కొలువై నిత్య పూజలు అందుకుంటోంది. కోరిన వరాలను కరుణతో ప్రసాదించే అమ్మవారిని అనేక మంది తమ ఇలవేల్పుగా ఆరాధిస్తుంటారు. అలా అమ్మవారు భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం గుంటూరు జిల్లా 'పిడుగురాళ్ల' లోను దర్శనమిస్తుంది.

అమ్మవారి అపారమైన కరుణాకటాక్షాలను అందుకున్న దంపతులు చాలాకాలం కిందట ఇక్కడ ఆమెను ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారి సంఖ్య పెరుగుతూనే వుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, కళాకృతులతో తీర్చిదిద్దబడిన గోపుర ప్రాకారాలతో దర్శనమిస్తుంది. ఆలయ ముఖమంటపంలో స్తంభాలు ... పై కప్పు పద్మాకృతులతో శోభిల్లుతుంటాయి.

గర్భాలయంలో చలువరాతితో రూపొందించిన అమ్మవారి మూలమూర్తి నుంచుని భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ప్రతి శుక్రవారం విశేషంగా అమ్మవారికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా జరిగే కుంకుమ పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆ రాత్రి అమ్మవారికి 'అద్దాల మంటపం' లో పవళింపు సేవను జరుపుతారు.

ఆలయ ప్రాంగణంలో వరసిద్ధి వినాయకుడు ... హనుమంతుడు ... సత్యనారాయణ స్వామి ... సీతారాములు ... నవగ్రహాలు ప్రత్యేక మందిరాల్లో కొలువై పూజలు అందుకుంటూ వుంటారు. వైశాఖ మాసంలో జరిగే అమ్మవారి జన్మదిన వేడుకలలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. అమ్మవారు తమని చల్లగా చూస్తుందనీ ... ఆపదల నుంచి గట్టెక్కిస్తుందని ఇక్కడి స్థానికులు విశ్వసిస్తుంటారు. ఆ తల్లిని అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News