పూజగదిలో పెద్దల ఫోటోలు ?

ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ప్రతిఒక్కరి ఇంట్లోను పూజగది ఉండటమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో పూజగది విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. పూజకు ఒక గదిని కేటాయించలేని వారు, పూజా మందిరాన్నే తమ అభిరుచికి తగినట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.

పూజ గది అయినా ... పూజా మందిరమైనా అది మన జీవనవిధానాన్ని ... నడవడికను చాటి చెబుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పూజా మందిరం చూడగానే ఆ కుటుంబ సభ్యుల ఇష్టదైవం ఎవరనే విషయంతో పాటు, వారి పద్ధతులు ... ఆచారవ్యవహారాలు అన్నీ తెలిసిపోతుంటాయి.

అయితే కొంతమంది తమ పూజా మందిరాలలో కీర్తి శేషులైన తమ పెద్దల ఫోటోలను కూడా పెడుతూ వుంటారు. దైవంతో పాటు వారిని కూడా ఆరాధిస్తుంటారు. బయటివారు ఎవరైనా ఈ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తే మనసు కష్టపెట్టుకుంటారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, దైవ సమానులైన తమ పెద్దల ఫోటోలు పూజా మందిరంలో నుంచి తీయలేక ... అలాగని ఉంచలేక సతమతమైపోతుంటారు.

అలాంటివారికి శాస్త్రంలో సరైన సమాధానమే కనిపిస్తుంది. కీర్తిశేషులైన పెద్దలు దైవంతో సమానమనీ, వారిని పూజించడం వలన సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కనుక తల్లిదండ్రులైనా ... వారి పూర్వీకులైనా కీర్తిశేషులైనప్పుడు, వారి ఫోటోలను నిరభ్యంతరంగా పూజా మందిరంలో వుంచి పూజించుకోవచ్చునని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News