శ్రీరాముడి అనుగ్రహం

ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకున్న కబీరు, సన్యాసిగా ఆశ్రమ జీవితాన్ని గడపాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆయనకి ఎదురైన అనుభవాల కారణంగా, గృహస్తుగా వుంటూనే దైవచింతన చేయాలని నిర్ణయించుకున్నాడు. కనీస అవసరాలతో తన కుటుంబం గడవడానికిగాను ఒక పూట నేతపని చేసి ... మరో పూట శ్రీ రాముడి సేవకు ఉపయోగించేవాడు. ఇందులో భాగంగానే ఆయన శ్రీరాముడిని కీర్తిస్తూ వివిధ ప్రాంతాలలో తిరిగేవాడు.

అలా కంచర్ల గోపన్నను కూడా ఆధ్యాత్మిక పథంవైపు నడిపిన కబీరు, ఆ తరువాత రామదాసుగా మారిన గోపన్నను కలుసుకున్నాడు. అప్పటికే భద్రాచల శ్రీ రాముడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన రామదాసు, కబీరును సాదరంగా ఆహ్వానించాడు. స్వామివారి దర్శనంతో తన జన్మ సార్థకం కాబోతుందని భావిస్తూ కబీరు ఆలయ ప్రవేశం చేయబోగా, అగ్రవర్ణాలవారు ఆయనను అడ్డుకున్నారు. రామదాసు వైఖరిపట్ల కూడా వాళ్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. దాంతో రామదాసు మనసుకి కష్టం కలిగింది.

ఆలయంలోకి కబీరు రావడం తప్పయితే ఆ రాముడినే బయటికి తీసుకువస్తానంటూ రామదాసు ఆ స్వామి ఉత్సవ మూర్తులను బయటికి తీసుకువచ్చాడు. రాముడిని చూడగానే కబీరు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. తన చేతిలోని మట్టి పాత్రతో నీళ్లు తెచ్చి స్వామివారిని అభిషేకించడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని అక్కడి వాళ్లు అడ్డుకున్నారు. ఆ ఘర్షణలో ఆ మట్టిపాత్ర చేజారి పగిలిపోవడంతో నీళ్లన్నీ నేలపాలయ్యాయి.

అదే సమయంలో ఓ అనూహ్యమైన సంఘటన అక్కడ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ముక్కలైపోయిన మట్టిపాత్ర తిరిగి తన పూర్తి రూపాన్ని పొందింది ... ఒలికిపోయిన నీరంతా తిరిగి పాత్రలోకి ప్రవేశించింది. ఈ దృశ్యం చూసిన తరువాత కబీరు ఎంతటి భక్తుడనే విషయం అక్కడి వారికి అర్థమైపోయింది. అభిషేకానికి శ్రీ రాముడి అనుమతి లభించిందంటూ, ఆ ఉత్సవ మూర్తులను కబీరు అభిషేకించాడు.

తమ తొందరపాటుని మన్నించమంటూ అంతా ఆయనని ప్రాధేయపడ్డారు. ఇక మీదట శ్రీరాముడిని దర్శించాలనుకునే వారికి కులమనేది అడ్డుగోడ కాకూడదనే ఉద్దేశంతో, స్వామివారి కల్యాణం ఆరుబయట జరపాలని రామదాసు నిర్ణయించడానికి ఈ సంఘటనే కారణమైంది.


More Bhakti News