శని శింగణా పూర్

నవగ్రహాలలో ఒకరైన శనిదేవుడికి ప్రత్యేకమైన ... విశిష్టమైన స్థానం వుంది. ఆయన అనుగ్రహం ప్రతిఒక్కరికీ అవసరమే. ఆయన ఏ మాత్రం కాస్త తేడాగా చూసినా ఇక వారుపడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అన్నిరకాల సమస్యలను సృష్టించి, వాటిలో నుంచి బయట పడకుండా అన్ని దార్లను మూసివేయడం శనిదేవుడి ప్రత్యేకత. అందుకే ఆయనపట్ల అంతా వీలైనంత వినయంగా ఉంటూవుంటారు ... భక్తి శ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహిస్తూ వుంటారు.

అలా భక్తులచే అయన పూజలందుకుంటోన్న క్షేత్రమే 'శని శింగణా పూర్'. ఇది మహారాష్ట్రలో శిరిడీ క్షేత్రానికి సమీపంలో దర్శనమిస్తోంది. శనిదేవుడు స్వయంభువుగా ఆవిర్భవించిన కారణంగా ఇది విశిష్టమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు ఈ శిలారూపం ఇక్కడికి కొట్టుకుని వచ్చి ఒక చెట్టు మొదట్లో ఆగిందట. దానిని కదిలించడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని ఓ వ్యక్తికి శనిదేవుడు కలలో కనిపించి, తనని ప్రతిష్ఠించే బాధ్యతను ఆయనకి అప్పగించాడు. ఆ వ్యక్తి గ్రామస్తులకు ఆ విషయం చెప్పి, వారి సహాయ సహకారాలతో శనిదేవుడి శిలా రూపాన్ని ప్రతిష్ఠించాడు.

ఆ రోజు నుంచి నిత్యం ఎందరో భక్తులు స్వామి వారికి పూజాభిషేకాలు నిర్వహించి వెళుతుంటారు. ఇక్కడ శనిదేవుడు గర్భాలయంలో కాకుండా, శిలా రూపంలో ఆరుబయట కొలువై ఉంటాడు. భక్తులు పూజాభిషేకాలు స్వయంగా నిర్వహించడం కోసమే స్వామి ఇలా కొలువై ఉన్నాడని చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ముందుగా త్రిశూలం కనిపిస్తుంది. భక్తులు తమవెంట తెచ్చిన జిల్లేడు ఆకులు ... నల్లని వస్త్రాలను ఆ త్రిశూలం దగ్గర సమర్పిస్తారు.

త్రిశూల దర్శనం అనంతరం శనిదేవుడు కొలువుదీరిన ప్రధాన వేదిక దగ్గరకి చేరుకొని స్వయంగా నువ్వులనూనెతో అభిషేకం చేస్తారు. ఈ క్షేత్రానికి వచ్చిన స్త్రీలు స్వామిని దూరం నుంచే దర్శించుకుంటారు. అభిషేకం చేసే అవకాశం ఒక్క పురుషులకు మాత్రమే కల్పించబడింది. శనిత్రయోదశి రోజున ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన ఆయన అనుగ్రహంతో శనిదోషాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు.


More Bhakti News