ద్వాపరయుగ గణపతి

సమస్త దేవతలు ... సకలలోకాలు వినాయకుడిని ఆరాధిస్తుంటాయి ... ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తుంటాయి. ఈ కారణంగానే వినాయకుడు యుగయుగాల నుంచి పూజలు అందుకుంటూ వస్తున్నాడు. ఇలా ప్రాచీన నేపథ్యం గలిగిన గణపతి క్షేత్రాలు నేడు భక్తుల పాలిట కామధేనువులా విరాజిల్లుతున్నాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా కర్ణాటక లోని 'ఇదగుంజి' దర్శనమిస్తుంది.

శరావతి నదీ తీరంలో భాసిల్లుతోన్న ఈ క్షేత్రం 'ద్వాపరయుగం' నాటిదని పురాణాల వలన తెలుస్తోంది. ద్వాపరయుగం ముగియడానికి సమయం దగ్గర పడుతూ ఉండటంతో, కలియుగంలో చోటుచేసుకోనున్న పరిణామాల గురించి రుషి గణాలు ఆలోచన చేశాయి. కలియుగంలో అధర్మం విలయతాండవం చేయనుందని గ్రహించి, దానిని అరికట్టడానికి యజ్ఞయాగాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒకప్పుడు 'కుంజారణ్యం' పేరుతో పిలవబడుతోన్న ఈ ప్రదేశమే అందుకు తగినదని వాళ్లంతా భావించారు.

పరమపవిత్రమైన ఈ ప్రదేశానికి చేరుకొని యజ్ఞ యాగాలకు కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు. త్రిమూర్తులతో పాటుగా వినాయకుడిని కూడా ఆహ్వానించి, వారి సమక్షంలో యజ్ఞయాగాది క్రతువులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తికాగానే త్రిమూర్తులతో పాటు వినాయకుడు కూడా అక్కడి నుంచి బయలుదేరగా, ఆయన ఒక్కడిని ఇక్కడ కొలువుదీర వలసిందిగా రుషి గణాలు కోరాయి. వారి ప్రార్ధనను మన్నించిన వినాయకుడు ఇక్కడే ఉండిపోయాడట. కాలక్రమంలో కుంజారణ్యం పేరు కాస్తా 'ఇదగుంజి' గా మారిందని అంటారు. గర్భాలయంలో స్వామివారు నుంచుని దర్శనమిస్తూ వుండటం ఇక్కడి విశేషం.

ప్రస్తుతం స్వామివారు కొలువుదీరి కనిపిస్తున్న ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినది. ఎన్నో రాజ వంశాలకి చెందిన వారు ... మరెందరో మహా భక్తులు ఇక్కడి స్వామివారిని సేవించి తరించిన ఆధారాలు వున్నాయి. పర్వదినాల సమయాల్లోనే కాదు, సాధారణ రోజుల్లో కూడా ఇక్కడి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఇక్కడి స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రారంభించిన కార్యాలకు ఎలాంటి పరిస్థితుల్లోను ఎటువంటి ఆటంకాలు కలగవని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News