గణపతికి గరికపూజ ఎందుకు ?

తల్లిదండ్రులను పూజించడం వలన సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందనీ, తల్లిదండ్రులకు ప్రదక్షిణా నమస్కారాలు తెలియజేయడం వలన సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం కలుగుతుందని ఈ లోకానికి చాటిచెప్పాడు వినాయకుడు. గణాధి పత్యాన్ని స్వీకరించిన వినాయకుడు అటు దేవతలతోను ... ఇటు మానవులతోను తొలిపూజలు అందుకుంటున్నాడు.

సాధారణంగా దేవతలందరినీ వివిధ రకాల పూలతో పూజించడం జరుగుతూ వుంటుంది. ఇక వీలైతే ఆయా దేవతలకి ఇష్టమైన పూలను గురించి తెలుసుకుని పూజిస్తుంటారు. సమస్త దేవతలు వివిధ రకాల పూలతో అభిషేకాన్ని కోరుకుంటూ వుంటే, వినాయకుడు మాత్రం తన పూజకు గరికపోచలను కోరుకోవడం చిత్రంగా అనిపిస్తుంది. వివిధ రకాల ఆకులతో ... గరికతో ఆయనని పూజించడం ఆనవాయతీగా వస్తున్నప్పటికీ, ఇందుకు గల కారణం చాలామందికి తెలియదనే చెప్పాలి. కోరిన వరాలను ప్రసాదించే గణపతిని గరికతో పూజించడం వెనుక పురాణ సంబంధమైన కథ ఒకటి వుంది.

పూర్వం దేవలోకంలో సమస్త దేవతల సమక్షంలో 'తిలోత్తమ' నాట్యం చేస్తూ వుండగా, ఆమె అందచందాలు చూసి మోహావేశానికి లోనైన యమధర్మరాజుకి అక్కడే స్కలనమైంది. ఆ వీర్యం నుంచి మహాశక్తిమంతుడైన 'అనలాసురుడు' ఉద్భవించాడు. ఒక్కసారిగా ఆ రాక్షసుడు దేవతలపై విరుచుకుపడటంతో తలోదిక్కుకు పరుగులుతీశారు. తమని రక్షించమంటూ శ్రీ మహా విష్ణువును వేడుకున్నారు. ఆయన ప్రార్ధనమేరకు వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు.

శ్రీమహావిష్ణువు కోరికమేరకు అనలాసురుడిని వినాయకుడు ఎదుర్కున్నాడు. అగ్నిగోళంలా దూసుకువస్తున్న అనాలాసురుడిని అమాంతంగా మింగేశాడు. ఊహించని ఈ సంఘటనకు దేవతలంతా విస్తుపోయారు. అనలాసురుడిని మింగిన వినాయకుడు కడుపులో విపరీతమైన మంటతో బాధపడసాగాడు. ఆ బాధ నుంచి ఆయనని బయటపడేయడానికి దేవతలంతా ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్లు చేయసాగారు. అయినా ఆయన బాధకి ఉపశమనం కలగకపోవడంతో అయోమయంలో పడిపోయారు.

విషయం తెలుసుకున్న సమస్త రుషి గణాలు ఒక్కొక్కరూ 21 గడ్డిపోచలను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. వినాయకుడికి ఉపశమనం కలగాలని ప్రార్ధిస్తూ భక్తిశ్రద్ధలతో ఆయనకి ఆ గరికపోచలను సమర్పించారు. అప్పటి వరకూ బాధతో తల్లడిల్లిపోయిన వినాయకుడికి ఆ గరికల కారణంగా ఉపశమనం లభించింది. దాంతో ఆయనతో పాటు దేవతలందరికీ మనసు తేలికపడింది. సమస్త రుషి గణాలపై వినాయకుడు తన కరుణా కటాక్షాలను కురిపించాడు.

తనకి ఎవరైతే 21 గరికపోచలతో పూజలు చేస్తారో వారికి తన అనుగ్రహం వెంటనే లభిస్తుందని ఆ సమయంలోనే వినాయకుడు చెప్పాడు. తనని గరికతో పూజించడం వలన అనేకమైనటువంటి యజ్ఞ యాగాలు ... అపారమైన దానధర్మాలు చేసిన పుణ్య ఫలాలు లభిస్తాయని సెలవిచ్చాడు. ఈ కారణంగానే గణపతిని వినాయక చవితి రోజున గరికతో పూజించాలని 'గణేశ పురాణం' చెబుతోంది.


More Bhakti News