రాఘవేంద్రుని మహిమ

సుందరమైన రూపం ... ప్రశాంతమైన వదనం ... అపారమైన జ్ఞానం రాఘవేంద్రస్వామి సొంతం. నిరంతరం భగవంతుడిని సేవిస్తూ ... తనని నమ్మినవారిని అనుగ్రహిస్తూ ఆయన తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో మహిమలు చూపాడు. అయితే అవన్నీ కూడా ఆయన కావాలని చేసినవి కావు. తనని పరీక్షించడానికి ఇతరులు ప్రయత్నించగా చేతల ద్వారా ఆయన వాటికి ఇచ్చిన సమాధానాలు మహిమలుగా ప్రసిద్ధికెక్కాయి.

అలాంటి వాటిలో ఒక సంఘటన గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఈనాటి మంత్రాలయం ఒకప్పుడు 'మంచాల' పేరుతో పిలవబడుతూ వుండేది. రాఘవేంద్రస్వామి మహిమల గురించి ఆ గ్రామం చుట్టుపక్కల వారు గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎంతో మంది ఆయన దర్శనం చేసుకోవాలని ఆరాటపడుతూ వుండేవారు. మరికొందరు ఎంత దూరమైనా లెక్కచేయక కాలినడకన ఆయన ఆశ్రమానికి బయలుదేరేవారు.

అందరూ చెప్పుకునేంతటి గొప్పతనం రాఘవేంద్రుడి దగ్గర ఏవుందనేది తెలుసుకోవాలని ఓ ముగ్గురు బ్రాహ్మణులు అనుకున్నారు. ఆయనను ప్రత్యక్షంగా చూడటం వల్లనే తమ సందేహం తీరుతుందనే ఉద్దేశంతో ఆ ముగ్గురు మంచాల గ్రామానికి కాలినడకన బయలుదేరారు. దారిలో కూడా వాళ్లు రాఘవేంద్రస్వామి గురించిన సంభాషణలనే కొనసాగిస్తూ గ్రామ సమీపానికి చేరుకున్నారు. మూలరాముడి పూజ ముగిసిన తరువాత ఆశ్రమంలో అతిథులకు భోజనాలు పెడతారని తెలుసుకున్న ఆ బ్రాహ్మణులు, రాఘవేంద్రుడు నిజంగా దైవాంశ సంభూతుడే అయితే తమలో ఎవరికి ఇష్టమైన తీపి పదార్థాలను వారి విస్తళ్లలో వడ్డించబడాలని అనుకున్నారు.

తుంగభద్రా నదిలో స్నానాలు ఆచరించి ఆశ్రమానికి చేరుకున్నారు. రాఘవేంద్రుడి పూజ ముగిసిన తరువాత భోజనాల్లో కూర్చున్నారు. అందరితో భోజనానికి కూర్చున్నప్పటికీ, ఈ ముగ్గురు బ్రాహ్మణులకు మాత్రం ఎవరికి ఇష్టమైన తీపి పదార్థాలు వారికి వడ్డించబడ్డాయి. అంతే ఆ ముగ్గురూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చకచకా భోజనాలు కానిచ్చేసి స్వామివారికి కనిపించి వెళదామని ఆయన దగ్గరికి వచ్చారు.

వారిని చూడగానే స్వామి నవ్వుతూ వారికి ఇష్టమైన వంటకాలు రుచిగా ఉన్నాయా ... లేదా అంటూ అడిగారు. అంతే ఒక్కసారిగా ఆ ముగ్గురూ ఆయన పాదాలపై పడిపోయారు. ఆయన శక్తిని పరీక్షించాలనే ఆలోచన చేసినందుకు తమని మన్నించమంటూ ప్రాధేయపడ్డారు. ఆయన అనుగ్రహించడంతో తేలికపడిన మనసులతో వాళ్లు అక్కడి నుంచి బయలుదేరారు.


More Bhakti News