విద్యార్ధులకు గణపతి పూజ

వినాయక చవితి పండుగ అనగానే పెద్దలకన్నా పిల్లల హడావిడే ఎక్కువగా వుంటుంది. గ్రామాల్లో గానీ ... నగరాల్లో గాని వినాయక చవితి పండుగ ప్రారంభమైన దగ్గర నుంచి, నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ పిల్లలు చేసే సందడే ఎక్కువగా వుంటుంది. మట్టి వినాయకుణ్ణి చేయడం ... పత్రిని సేకరించడం ... పాలవెల్లి కింద పీఠంపై వినాయక ప్రతిమను ఏర్పాటుచేయడం ... స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడంలో పిల్లలే ప్రధానమైన పాత్రను పోషిస్తుంటారు.

అల్లరిగా వాళ్లు చేసే ఈ తంతునే ఆయన ఆనందంగా చూస్తూ అనుగ్రహిస్తుంటాడు. నియమాలతో కూడిన పూజకన్నా ప్రేమతో పిల్లలు చేసే పూజకే ఆయన ఎక్కువగా స్పందిస్తుంటాడు. ఈ పండుగ సంబరాలను పరిశీలించినట్టయితే, ఆయన పిల్లలకి దగ్గరగా పిల్లల దేవుడిగానే కనిపిస్తుంటాడు. అలాంటి పిల్లలంతా మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనే వాళ్ల తల్లిదండ్రులు కోరుకుంటూ వుంటారు. ఈ కారణంగానే వినాయక చవితి రోజున కూడా పిల్లల పుస్తకాలను పూజలో వుంచడం జరుగుతూ వుంటుంది.

వినాయకుడు బుద్ధి సూక్ష్మత కలిగినవాడు. రాయడంలోనూ ... చదవడంలోనూ ఆయన వేగాన్ని అందుకోవడం ఇతరులకు సాధ్యం కాదనే విషయాన్ని పురాణాలు ప్రస్తావించాయి. వ్యాసమహర్షి మహా వేగంగా మహాభారతం చెప్పుకుంటూ వెళుతుంటే, ఆ విషయాలను జ్ఞాపకం ఉంచుకుని అంతే వేగంగా ఆయన మహాభారతం రాసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షల్లో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించాలంటే ఇటు చదవడంలోనూ ... అటు రాయడంలోను అసమానమైన ప్రతిభను కనబరచాలి.

ఈ విషయంలో వెనుకబడిన వారు వినాయకుడిని పూజించడం వలన, జ్ఞాపకశక్తి వృద్ధి చెందడమే కాకుండా వేగంగా రాసే నైపుణ్యాన్ని సంపాదించగలుగుతారు. నిత్యం గణపతిని ఆరాధించడం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షలు రాయగలుగుతారు. పరీక్షా సమయంలో ఆయనను స్మరించడం వలన ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News