మహిమాన్విత క్షేత్రం

దైవం ఆవిర్భవించిన ప్రతి ప్రదేశం ఓ పుణ్య క్షేత్రమే. దైవం తన అవతార కార్యాన్ని బట్టి కొండలపైనా ... నదీ తీరాలలోను ... కొండ గుహలలోను కొలువై కనిపిస్తుంది. ఈ విధంగా ఆవిర్భవించిన క్షేత్రాలలో శైవ క్షేత్రాలు ... వైష్ణవ క్షేత్రాలు ... శక్తి క్షేత్రాలు దర్శనమిస్తుంటాయి. ఏ క్షేత్రానికి ఉండవలసిన విశిష్టత ... ప్రత్యేకత ఆ క్షేత్రానికి వుంటూనే వుంటాయి.

అయితే శివుడు ... విష్ణువు ... ఆదిపరాశక్తి కొలువైన క్షేత్రం మరింత శక్తిమంతమైన క్షేత్రంగా చెప్పబడుతుంది. ఇంతటి అరుదైన ... మహిమాన్వితమైన క్షేత్రం మనకి మధ్యప్రదేశ్ లోని 'జబల్ పూర్' లో దర్శనమిస్తుంది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రంలో ఒకప్పుడు 'జాబాలి మహర్షి' తపస్సు చేయడం వలన, ఈ ప్రాంతానికి జబల్ పూర్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. నర్మదానదీ తీరంలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో శ్రీబాలాత్రిపురసుందరి ఆలయం ... శ్రీ పశుపతినాథ ఆలయం ... శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం దర్శనమిస్తుంటాయి.

త్రిపురసుందరితో పాటు గర్భాలయంలో శక్తి గణపతి కొలువై పూజలు అందుకోవడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. ఇక గర్భాలయంలోని శివుడు మూడు ముఖాలతో దర్శనమిస్తుండటం, మరో ప్రత్యేక మందిరంలో ఏకాదశ రుద్రుల పేరుతో 11 శివలింగాలు కొలువుదీరి వుండటం మరో విశేషమని చెబుతుంటారు. ఇక ఇక్కడి లక్ష్మీనారాయణ స్వామికి ... బలిచక్రవర్తికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో వుంది.

నర్మదా నదీ తీరంలో నర్మదాదేవి మందిరంతో పాటు సూర్యదేవుడి మందిరం ... గణపతి మందిరం ... పంచముఖ హనుమ మందిరం కొలువుదీరి కనిపిస్తుంటాయి. ఇటు చారిత్రక వైభవాన్ని ... అటు పురాణ పరమైన నేపథ్యాన్ని కలిగివున్న కారణంగా ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగానే వుంటుంది. అందమైన ప్రకృతి ఒడిలో ... ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, మానసిక ప్రశాంతత లభిస్తుందనీ, పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News