కలలు నిజమవుతాయా ?

'కల' అనే రెండు అక్షరాలకి ఎంతో ప్రాధాన్యత వుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలలు కంటూనే వుంటారు. బాల్యం ... యవ్వనం ... వృద్ధాప్యం ... ఇలా అన్ని దశల్లోనూ కలలనేవి వస్తూనే వుంటాయి. సాధారణంగా కలలనేవీ మనసులోని భావాలకు దృశ్య రూపాలుగా చెప్పబడుతుంటాయి. ఇందువల్లనే కలలు వయసును బట్టి, వారి ఆలోచనలను బట్టి వస్తూ వుంటాయి.

బాలలకు ఆటపాటలకి సంబంధించిన కలలు ... వృద్ధులకు దైవ సంబంధమైన కలలు వస్తుంటాయి. యవ్వనంలో మనసు ఉత్సాహంతో ... ఉల్లాసంతో నిండి వుంటుంది కనుక, అందమైన కలలు ఎక్కువగా వస్తూ వుంటాయి. మనసు ప్రశాంతంగా ... ఆనందంగా వుంటే అందమైన కలలు వస్తుంటాయి. అది ఆందోళనకి లోనైతే పీడకలలు వస్తుంటాయి. అందమైన కల వచ్చినప్పుడు అది నిజం కావాలని కోరుకోవడం, పీడ కల వస్తే అది నిజం కాకూడదని దైవాన్ని ప్రార్ధించడం సహజంగా జరుగుతూ వుంటుంది.

ఈ నేపథ్యంలో అసలు కలలు నిజమవుతాయా? అనే సందేహం చాలా మందికి కలుగుతూ వుంటుంది. ఎవరికైనా సరే ఒక్కోసారి వారి భావాలకు సంబంధంలేని కలలు వస్తూ వుంటాయి. ఆ కలలు వారికి ఆనందాన్ని గానీ ... ఆందోళననిగాని కలిగించేవి అయ్యుండవచ్చు. ఇలాంటి కలలు వచ్చిన సమయాన్ని బట్టి అవి నిజమయ్యే అవకాశాలు వున్నాయని 'స్వప్న శాస్త్రం' చెబుతోంది. ఈ శాస్త్రం కలలు వచ్చే సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించింది.

సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ఒక భాగం, 9 నుంచి 12 వరకూ రెండో భాగం, 12 నుంచి 3 వరకూ మూడో భాగం, 3 నుంచి 4 వరకూ నాల్గొవ భాగంగా పేర్కొంది. ఈ నాలుగు భాగాలలో రెండో భాగంలో వచ్చిన కలలు ఏడాదిలోగా ఫలితాలు చూపుతాయనీ, మూడవ భాగంలో వచ్చిన కలలు ఆరు నెలలోగా ఫలితాలు చూపుతాయని స్పష్టం చేస్తోంది.


More Bhakti News