గ్రహణ సమయంలో ధ్యానం

సాధారణంగా గ్రహణం రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించకుండా దేవాలయాలు మూసి వుంచుతుంటారు. అలాగే ఇళ్లలోనూ పూజా మందిరాలలో పూజలు చేయడం మానేస్తుంటారు. గ్రహణం విడిచాక శుద్ధి కార్యక్రమం పూర్తి అయిన తరువాతనే తిరిగి పూజలు జరుపుతుంటారు. గ్రహణ సమయంలో పూజలు చేయకూడదు కాబట్టి, జపాలు ... ధ్యానాలు కూడా చేయకూడదా ? అనే సందేహం చాలా మందిలో తలెత్తుతుంటుంది.

ఈ సందేహానికి సమాధానంగా , గ్రహణ సమయంలో జపాలు ... ధ్యానాలు చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. గ్రహణం మొదలయ్యే సమయానికి స్నానంచేసి, ఓ పాత్రలోని నీటిలో పూజా మందిరంలోని దేవుడి ప్రతిమలను ఉంచాలి. ఆ ప్రతిమలుపైకి కనిపించకుండా గరికను ఏర్పాటు చెయ్యాలి. ఆ తరువాత ధ్యానంలో కూర్చుని, గ్రహణం పూర్తి అయ్యేంత వరకూ దానిని కొనసాగించాలి.

ఈ సమయంలో ఇష్ట దైవాన్ని స్మరించినా ... దైవ నామాలను రాసినా ఉత్తమ ఫలితాలు ప్రాప్తిస్తాయని అంటారు. సాధారణంగా గ్రహణ సమయంలో చాలామంది జపాలు చేస్తుంటారు. అయితే కోటిసార్లు జపం చేయడం వలన కలిగే ఫలితం, ఒకసారి ధ్యానం చేయడం వలన కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. గ్రహణ సమయంలో జపం కన్నా ధ్యానం అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానిని ఆచరించడమే శుభప్రదమని చెప్పబడుతోంది.


More Bhakti News