సీతమ్మ వాగు

శ్రీ రాముడు నడయాడిన పుణ్య భూమిపై జన్మించడమే భారతీయులు అదృష్టంగా భావిస్తుంటారు. ధర్మబద్ధమైన ... ఆదర్శవంతమైన జీవితానికి అద్దమై నిలిచిన శ్రీ రాముడి గురించి తెలుసుకోవడానికి, ఆయన తిరుగాడిన ప్రదేశాలను స్పర్శించడానికి అంతా ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారికి 'సీతమ్మ వాగు' దర్శనం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

భద్రాచలానికి వెళ్లే భక్తులు అక్కడికి సమీపంలో వున్న ఈ పుణ్యస్థలిని తప్పనిసరిగా దర్శించుకుంటారు. కొండలనడుమ పచ్చని ప్రకృతి ఒడిలో 'సీతమ్మవాగు' కనిపిస్తుంది. ఈ వాగులో సీతమ్మ వారు స్నానం చేసిన కారణంగానే ఈ పేరుతో పిలవబడుతోంది. వాగు ఒడ్డునే పసుపు కుంకుమ రాళ్లు కనిపిస్తుంటాయి. ఇక సీతమ్మవారు తన నారచీరను ఇక్కడి బండరాయిపై ఆరవేసేదనడానికి నిదర్శనంగా ఇక్కడి రాయిపై ఏర్పడిన చారికలు కనిపిస్తుంటాయి.

ఇక ఇక్కడున్న ఓ బండరాయిపై శ్రీ రాముడు కూర్చునేవాడని చెబుతుంటారు. ఆ రాయిని చూస్తే నిజంగానే ఆయన అక్కడ కూర్చునే ఉంటాడని అనిపిస్తుంది. అంత వీలుగా ... అంత సహజంగా అది అక్కడ అమరి కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు రాముడు కూర్చున్న ఈ రాయికి అభిషేకం చేసి, తమ శిరస్సు వంచి నమస్కరిస్తూ తరిస్తుంటారు. ఆ పక్కనేగల సీతమ్మవారి ప్రతిమకు పూజలు చేస్తుంటారు.

సీతారాములు కాలక్షేపం కోసం చింతగింజలతో 'వాన గుంటలు' అనే ఆట ఆడారనడానికి ఇక్కడ ఆనవాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడగానే ప్రతి ఒక్కరి మనసు భారమవుతుంది. ఆప్యాయంగా ఆ ప్రదేశాన్ని తడిమి తడిమి చూడాలనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎటు చూసినా పవిత్రత కొట్టొచ్చినట్టు కనిపించే ఈ ప్రదేశంలోని ఓ చెట్టుకు భక్తులు ముడుపులు కడుతుంటారు. సీతారాముల అనుగ్రహంతో తమ కోరికలు నెరవేరినప్పుడు తిరిగి వచ్చి వారి దర్శనం చేసుకుంటూ వుంటారు.


More Bhakti News