శ్రీ బాలాంజనేయ క్షేత్రం

హనుమంతుడు మహా శక్తిమంతుడు ... అంతకుమించి ఎంతో చురుకైనవాడు. అందువలన ఆయనను పట్టుకుని వుండటం ... కనిపెట్టుకుని వుండటం అంజనాదేవికి కష్టసాధ్యంగా వుండేది. బాలుడిగా ఉండగానే అసాధారణమైన ప్రతిభను ... పరాక్రమాన్ని చూపిన హనుమంతుడు, తన భక్తులను అనేక విధాలుగా అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అలా ఆయన స్వయంభువుగా వెలసిన క్షేత్రం హైదరాబాద్ - కూకట్ పల్లి లోని భాగ్ అమీర్ ప్రాంతంలో దర్శనమిస్తుంది.

సాధారణంగా హనుమంతుడు భక్తాంజనేయుడిగా ... ప్రసన్నాంజనేయుడిగా ... వీరాంజనేయుడిగా దర్శనమిస్తుంటాడు. అలాంటిది బాలాంజనేయుడిగా కొలువై వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ హనుమంతుడు వెలిశాడని స్థానికులు చెబుతుంటారు. ఈ ప్రాంతం అడవిని తలపించే కాలంలో పాదచారులకు స్వామి దర్శనమిచ్చి, తన జాడను తెలియజేశాడని అంటారు. ఆనాటి నుంచి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

కాలక్రమంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం ... దానిని అభివృద్ధి పరుస్తూ రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రాంగణంలో భవానీ సమేత అమరలింగేశ్వరుడు ... సుబ్రహ్మణ్య స్వామి ... నవగ్రహాలు కొలువుదీరాయి. ఇక్కడి బాలాంజనేయుడు భక్త సులభుడని అంటారు. భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించినవారిని గ్రహ దోషాలు బాధించవని చెబుతుంటారు.

జ్ఞానాన్ని ... సంపదలను ప్రసాదించే బాలాంజనేయస్వామికి ప్రతి మంగళవారం ఆకుపూజలు ... వడమాల సమర్పణలు జరుగుతుంటాయి. హనుమజ్జయంతి రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజున విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులను ... అభయాన్ని పొందుతుంటారు.


More Bhakti News