ప్రత్తిపాడు గోపాలుడు

కృష్ణుడు కొంటెవాడే కాదు కోరికలను నెరవేర్చే పరంధాముడు కూడా. అందగాడు అల్లరివాడే కాదు అందరివాడు కూడా. అందుకే ఆయన అనేక నామాలతో వివిధ ప్రాంతాల్లో ఆవిర్భవించాడు ... తన లీలావిశేషాలను అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. అలా శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామా సమేతంగా కొలువుదీరిన క్షేత్రం గుంటూరు జిల్లా 'ప్రత్తిపాడు'లో దర్శనమిస్తుంది.

ఈ క్షేత్రానికి శతాబ్దాలనాటి చరిత్ర వుంది. ఎందరో రాజ వంశీకులకు ఈ స్వామి ఇలవేల్పుగా నిలచిన నేపథ్యం వుంది. పల్లవులు ... చోళులు ... విష్ణుకుండినులు ... రెడ్డి రాజులు ... కాకతీయులు ... గజపతులు ... విజయనగర రాజులు ఈ వేణుగోపాలస్వామిని సేవించి తరించారు. స్వామివారి నిత్య పూజలకు లోటు రాకుండా శాశ్విత ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.

స్వామివారు గర్భాలయంలో వేణుగోపాలస్వామి అనే నామధేయాన్ని కలిగి ఉన్నప్పటికీ, శంఖు చక్రాలను ధరించి వేంకటేశ్వర స్వామిలా దర్శనమిస్తుంటాడు. ఈ కారణంగానే ఇక్కడి స్వామి వేంకట వేణుగోపాలుడుగా పిలవబడుతున్నాడు. అనారోగ్యాల నుంచి ... ఆపదల నుంచి భక్తులను బయటపడేయడంలో ఇక్కడి స్వామి ప్రసిద్ధి చెందాడు.

ఇదే ప్రాంగణంలో 'సీతారాముల ఆలయం' ... 'హనుమంతుడి మందిరం' కూడా కనిపిస్తాయి. లక్ష్మణ స్వామి లేకుండా సీతారాములు మాత్రమే కొలువై వుండటం, హనుమంతుడు మీసాలను కలిగి వుండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. కృష్ణుడు కొలువైన కారణంగా 'కృష్ణాష్టమి' వేడుకలను, రాముడు నెలవైన కారణంగా శ్రీ రామనవమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రానికి తరలి వస్తుంటారు ... పుణ్య ఫలాలతో తిరిగి వెళుతుంటారు.


More Bhakti News