ఉపాసన ఫలితం

'ఉపాసన' అనే మాట మనకి ప్రాచీనకాలం నుంచి వినిపిస్తోంది. వివిధ ఆధ్యాత్మిక గ్రంధాలలో ఉపాసనకి సంబంధించిన ప్రస్తావనలు ... ప్రసిద్ధి చెందిన ఉపాసకుల విషయాలు కనిపిస్తుంటాయి. ఉపాసన అంటే ఒకే దైవాన్ని ... ఒకే మంత్రంతో ప్రతినిత్యం ... అనుక్షణం ధ్యానిస్తూ ఉండటమే. సంసార పరమైన ఆసక్తిని అనురక్తిని వదలి మనసును పరమాత్ముని పాదాల చెంత సమర్పించడమే.

ఆశకీ ... ఆకర్షణకి దూరంగా ఉంటూ అన్నిటా ఆ దైవాన్ని దర్శిస్తూ ఆ శక్తికి సమీపంగా ఉండటమే నిజమైన ఉపాసనగా శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా దేవీ ఉపాసన ... హనుమ ఉపాసన చేసే వారు ఎక్కువగా వుంటారు. మానసిక ... శారీరకపరమైన శక్తులను పొందడమే ప్రధాన ఉద్దేశంగా ఉపాసన కొనసాగుతుంది. శక్తి దేవతల అనుగ్రహాన్ని కోరుతూ ఈ ఉపాసన చేయవలసి వుంటుంది కాబట్టి, ఎంతో నియమ నిష్టలతో వ్యవహరించవలసి వుంటుంది.

ఈ విధంగా నిరంతరం కొనసాగించిన ఉపాసన కారణంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ సాధన మార్గంలో ప్రాప్తించే శక్తులను సమాజానికి మేలు చేసేందుకు ఉపయోగించాలనే శాస్త్రాలు చెబుతున్నాయి. అలా సమాజానికి మేలుచేసి ధన్యులైన వారి చరిత్రను కళ్ల ముందుచుతున్నాయి.

ఉపాసకులు తమకి దైవానుగ్రహం కారణంగా లభించిన శక్తులను తమ స్వార్థానికి ఉపయోగిస్తున్నట్టయితే, ఆ శక్తులను నిర్వీర్యం చేయడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడనే విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. మంచిమనసుతో ... మంచి ఉద్దేశంతో చేసిన ఉపాసన మాత్రమే సత్ఫలితాలను ఇస్తుందనే విషయం మరెన్నోమార్లు స్పష్టమైంది.


More Bhakti News