ముసలమ్మకట్ట

సదాశివుడు తనని ఆశ్రయించే భక్తుల కోసం ... తాను అనుగ్రహించవలసిన భక్తుల కోసం కైలాసం నుంచి కదలి వచ్చిన సంఘటనలు అనేకం వున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో అనేక క్షేత్రాలు ఆవిర్భవించాయి. అలా ఓ భక్తుడు మహాశివుడి మనసు గెలుచుకుని ఆయన ఆవిర్భవించేలా చేసిన క్షేత్రం అనంతపురం జిల్లా 'ముసలమ్మకట్ట'లో కనిపిస్తుంది.

ప్రాచీన నేపథ్యంగల ఈ క్షేత్రం హరిహరబుక్కరాయల కాలంలో తన ఉనికిని చాటుకున్నట్టు స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. కాలక్రమంలో ఆనాటి ఆలయం శిధిలావస్థకు చేరుకోగా, తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓ అవధూతకు స్వామివారు స్వప్న దర్శనమిచ్చి తన జాడను తెలియజేశారు. స్వామి ఆదేశం మేరకు ఆయన కాశీ నుంచి సాలగ్రామ శిల అయినటువంటి శివలింగాన్ని ఇక్కడికి తీసుకు వచ్చి ప్రతిష్ఠించారు. ఈ కారణంగానే స్వామివారిని భక్తులు కాశీ విశ్వేశ్వరుడిగా కొలుస్తుంటారు.

గర్భాలయంలో శివుడు మహిమాన్వితుడై మహా తేజస్సుతో వెలిగిపోతుంటాడు. నిస్వార్ధమైన భక్తితో తనని వెదుక్కుంటూ వచ్చే భక్తుల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తాడు. ఇక ఆ పక్కనే అమ్మవారు 'విశాలాక్షి' గా కుంకుమ పూజలు అందుకుంటూ వుంటుంది. స్వామివారికి నాలుగు సమయాల్లో సమర్పించే హారతులు ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. భక్తులు ఈ హారతుల కోసం తప్పనిసరిగా వేచివుంటారు.

ఇదే ప్రాంగణంలో అమృత గణపతి ... శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ... శ్రీ అయ్యప్ప స్వామి ... నవగ్రహ మందిరాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. పర్వదినాల సమయంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పాపాలు పటాపంచలవుతాయనీ, సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు.


More Bhakti News