అష్టలింగేశ్వర క్షేత్రం

పరమశివుడు తన కంఠంలో మరుగుతోన్న కాలకూట విష తాపాన్ని తట్టుకోవడం కోసం మంచుకొండల్లోనే నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. భూలోకంలో ఆయన ఆవిర్భవించిన ప్రదేశాలు కూడా చల్లని వాతావరణంలో కొండ కోనల నడుమ జలపాతాల సమీపంలో కొలువుదీరి కనిపిస్తుంటాయి.

ఈ కారణంగానే ఆయన క్షేత్రాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ... ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తాయి. అలా పార్వతీ పరమేశ్వరులు తమకి నచ్చిన ప్రదేశంలో కొలువై, అశేష భక్తజనకోటిచే పూజలు అందుకుంటోన్న క్షేత్రమే 'భైరవకోన'. పేరుకు తగినట్టుగానే శక్తిమంతమైన శివ స్థలంగా కనిపించే ఈ క్షేత్రం, ప్రకాశం జిల్లా పరిధిలో దర్శనమిస్తుంది.

ప్రాచీన కాలంలో భైరవకొండను ఎనిమిది గుహలుగా తొలచి ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ కారణంగా ఈ క్షేత్రం అష్టలింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. ప్రధాన ఆలయంలో భర్గులేశ్వరుడు గా శివుడు, త్రిముఖ దుర్గగా అమ్మవారు దర్శనమిస్తుంటారు. ఇక మిగతా ఆలయాలలో 'నగరేశ్వరుడు' .. 'మల్లికార్జునుడు' .. 'రుద్రేశ్వరుడు' .. 'ప్రచండ భైరవుడు' .. 'రామలింగేశ్వరుడు' .. 'విశ్వేశ్వరుడు' .. 'శశినాగ లింగేశ్వరుడు' కొలువుదీరి కనిపిస్తారు.

మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి పాలకుడిగా కాలభైరవుడు దర్శనమిస్తుంటాడు. కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులో భక్తులు స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు అమ్మవారిపై ప్రసరించడం ఇక్కడి ప్రత్యేకత. అద్భుతమైన ఈ దృశ్యాన్ని వీక్షించడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

మహా శివరాత్రి పర్వదినాన కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అడిగిన వెంటనే అమ్మలా స్పందించే శివుడికి భక్తులు ఫలపుష్పాలను సమర్పించుకుని దర్శిస్తుంటారు ... ఆ స్వామి లీలావిశేషాలను కొనియాడుతూ తరిస్తుంటారు.


More Bhakti News