భక్త ప్రహ్లాదుడు

దైవాన్ని ఆరాధిస్తూ ... అనుక్షణం ఆయన ధ్యానం చేస్తూ చరిత్రలో నిలిచిపోయిన బాల భక్తులు ఎందరో వున్నారు. అలాంటి బాల భక్తులలో ప్రహ్లాదుడు ఒకరు. హిరణ్య కశిపుడు ... లీలావతి దంపతులకు జన్మించిన ప్రహ్లాదుడు, హరి భక్తులలో అగ్రస్థానంలో కనిపిస్తాడు. తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి కారణంగా శ్రీహరి నామాన్ని వంటబట్టించుకున్న ప్రహ్లాదుడు, భూమ్మీదకి వచ్చాక తొలిమాటగా కూడా శ్రీహరి నామాన్నే పలికాడు.

తల్లిదండ్రుల పట్ల ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ, శ్రీహరిపై తనకి గల అచెంచలమైన విశ్వాసాన్ని ఏ మాత్రం సడలించలేదు. తన సోదరుడైన హిరాణ్యాక్షుడిని హతమార్చిన శ్రీహరిపై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం హిరణ్యకశిపుడు ఎదురుచూస్తున్నాడు. తన శత్రువు పేరును తన కుమారుడు అందంగా ... హాయిగా ... భక్తితో స్మరిస్తూ ఉండటాన్ని ఆయన భరించలేకపోయాడు.

తన రాజ్యంలో తాను విధించిన నిబంధనను తన ఇంట్లో తన కుమారుడు ఉల్లంఘించడాన్ని హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. హరి నామస్మరణ మానుకోమని తనకి తోచిన పద్ధతుల్లో ప్రహ్లాదుడికి చెప్పి చూశాడు. తండ్రి ఎంతగా మందలించినా ... తల్లి ఎంతగా బుజ్జగించినా ప్రహ్లాదుడు మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఈ విషయంలో తండ్రి తన అధికార బలాన్ని ఉపయోగించి ఎన్ని విధాలుగా చిత్ర హింసలకు గురిచేసినా వాటిని సంతోషంగా అనుభవించాడు.

ఇదంతా గమనిస్తోన్న శ్రీహరి ... ప్రతి పరీక్షలో తన భక్తుడికి అండగా నిలుస్తూ వచ్చాడు. సహనం నశించడంతో ... ఇక తన కుమారుడిని బెదిరించడం అనవసరమనీ, అతని ద్వారా శ్రీహరి జాడ తెలుసుకుంటే తాను అనుకున్నది సాధించవచ్చని హిరణ్యకశిపుడు నిర్ణయించుకున్నాడు. ప్రహాదుడిని మాటల్లోకి దించి, శ్రీహరిని చూపించమంటూ ఒత్తిడి చేశాడు. శ్రీహరి లేని ప్రదేశం ఎక్కడా లేదని ప్రహ్లాదుడు సమాధానమివ్వడంతో, అయితే చూపమంటూ అక్కడి స్తంభాన్ని తన గదతో మోదాడు.

భక్తుడికి ఎదురయ్యే ప్రతి పరీక్ష తనకి పెట్టిన పరీక్షగా భావించే శ్రీహరి, నరసింహంగా ఆ స్తంభంలో నుంచి బయటికి వచ్చాడు. విచిత్రమైన రూపం ... భయంకరమైన ఆకారం ... అంతవరకూ ఎక్కడా చూడని ఆగ్రహం చూడటంతో, హిరణ్య కశిపుడి శక్తి నశించింది. బ్రహ్మ నుంచి హిరణ్య కశిపుడు పొందిన వరంలోని లోపాలను గ్రహించిన శ్రీహరి, ఆ ప్రకారంగానే ఆ రాక్షస రాజును సంహరించాడు.

ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న ప్రహ్లాదుడు, స్వామిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ శాంతపరిచాడు. అలా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ... మహా శక్తిమంతమైన ఒక అవతారాన్ని ధరించడానికి ప్రహ్లాదుడు కారకుడయ్యాడు ... ఆ స్వామి సేవలో తరిస్తూ ఆయనలోనే ఐక్యమయ్యాడు.


More Bhakti News