విశాఖ పట్నం

కలియుగ అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామిని ఆపద మొక్కులవాడిగా భక్తులు పిలుచుకుంటూ వుంటారు. ఎంతటి ఆపదలో ఉన్నప్పటికీ ఆ స్వామికి మొక్కుకుంటే వెంటనే ఆ గండం నుంచి బయట పడేస్తాడని విశ్వసిస్తుంటారు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు కూడా వున్నాయి. విశాఖపట్నంలోని 'శృంగమణి' పర్వతంపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంటాడు.

పూర్వం ఆంగ్లేయులు నౌకాయానం ద్వారా ఇక్కడ వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆ సమయంలో ఒకరోజు సముద్రం మధ్యలో ఓడ వుండగా హఠాత్తుగా తుపాను ప్రారంభమైందట. అందులో వున్న హిందూ ... ముస్లిం ... క్రిష్టియన్ మతస్తులు తాము సురక్షతంగా తీరానికి చేరుకుంటే, తమ ఇష్ట దైవాల మందిరాలను ఇక్కడి పర్వతంపై నిర్మిస్తామని ప్రార్ధించారు. వారి ప్రార్ధనలు ఫలించి అంతా క్షేమంగా తీరానికి చేరుకున్నారు.

ఆ సమయంలోనే నౌక అడుగుభాగాన ఏదో రాయి అడ్డుపడినట్టుగ్గా అనిపించడంతో వెలికితీసి చూశారు. అది శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహంగా గుర్తించి దానిని ఇక్కడి పర్వతంపై ప్రతిష్ఠించారు. కాలక్రమలో ఈ ఆలయం అభివృద్ధి చెందడం ... ఆ పక్కనే ముస్లిములు దర్గాను ... క్రిష్టియన్లు చర్చిని ఏర్పాటు చేసుకోవడం జరిగాయి. గర్భాలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి నిండుగా ... కనుల పండుగగా కొలువుదీరిన ఈ క్షేత్రానికి పాలకుడిగా హనుమంతుడు వ్యవహరిస్తున్నాడు. విశాలమైన ఆలయ ప్రాంగణం ... అందంగా తీర్చిదిద్దిన ముఖమంటపం ... వరుసగా కొలువుదీరిన దశావతార మూర్తులు ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి.

ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాలు ... లక్ష కుంకుమార్చనలు ... లక్ష తులసి పూజలు జరుగుతూ వుంటాయి. పర్వదినాల సమయంలో స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. మతసామరస్యానికి వేదికగా ... ఆధ్యాత్మిక అనుభూతుల మాలికగా అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మనసుపై మరువలేని ముద్ర వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News