అశ్వత్థ నారాయణ క్షేత్రం

అశ్వత్థ వృక్షము (రావిచెట్టు)ను నారాయణ స్వరూపంగా భావించి పూజించడమనేది అనాదిగా వస్తోంది. ఈ కారణంగానే ప్రతి ఆలయంలోను రావిచెట్టు దేవతా వృక్షంగా పూజలు అందుకుంటోంది. రావిచెట్టును పొరపాటున కూడా నిందించ వద్దని దత్తాత్రేయుడు చెప్పినట్లు 'గురుచరిత్ర'లో కనిపిస్తుంది. అంతటి విశిష్టమైన ఈ చెట్టునీడలో సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు ఆవిర్భవిస్తే, ఇక ఆ క్షేత్ర మహాత్మ్యం గురించి చెప్పేదేముంటుంది.

అంతటి మహిమాన్వితమైన ఆ క్షేత్రం మనకి అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని 'పెద పప్పూరు' గ్రామంలో పినాకిని నదీ తీరంలో దర్శనమిస్తుంది. ఈ ప్రదేశం చూడగానే ఇది దివ్య క్షేత్రమనీ ... ప్రత్యక్ష నారాయణుడు ఇక్కడే కొలువై వున్నాడనే విషయం స్పష్టమవుతుంది.

పూర్వం 'శింగర భట్టు' అనే మహా ముని ఈ ప్రదేశంలో స్వామి సాక్షాత్కారం కోరుతూ పుష్కరకాలం పాటు తపస్సు చేశాడు. అప్పుడు ఆయన పినాకినిలో స్నానమాచారిస్తూ వుండగా నారాయణుడి విగ్రహం లభించింది. స్వామి ఆదేశం మేరకు శింగరభట్టు ఆ ప్రతిమను ఇక్కడి రావిచెట్టు నీడలో ప్రతిష్ఠించాడు. నాటి నుంచి స్వామి అశ్వత్థ నారాయణుడిగా ఆరుబయటే పూజలు అందుకుంటున్నాడు.

స్వామి కొలువుదీరిన ఈ వృక్షం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. తమ కోరికలు నెరవేరేలా చూడమని ప్రార్ధిస్తూ అదే చెట్టుకు ముడుపులు కడుతుంటారు. వివాహం ... సంతానం ... సౌభాగ్యం ... విద్య ... వుద్యోగం ... వ్యాపారం ఇలా భక్తులు ఏది కోరుకున్నా అవి వెంటనే తీరతాయని స్థానికులు చెబుతుంటారు.

ఇక ఈ క్షేత్రంలో సీతారాములు ... హనుమ ... నవగ్రహ మందిరాలతో పాటు, భీమేశ్వర లింగం కూడా దర్శన మిస్తుంటుంది. అజ్ఞాత వాస కాలంలో పాండవులు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు భీముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రమైన ప్రదేశంలో కొలువుదీరిన శివ కేశవులను దర్శించుకుంటే జన్మ చరితార్థమవుతుంది.


More Bhakti News