శ్రీపాదవల్లభ క్షేత్రం

శ్రీపాదవల్లభులు ... శ్రీ నృసింహ సరస్వతి ... శ్రీ అక్కల్ కోట స్వామి ... శ్రీ మాణిక్య ప్రభు ... శ్రీ శిరిడీ సాయిబాబా ... దత్తాత్రేయస్వామి అవతారాలుగా చెప్పబడ్డారు. దత్తాత్రేయుని తొలి అవతారంగా చెప్పబడిన శ్రీపాదవల్లభుని అవతారానికి ఎంతో విశిష్టత వుంది. ఆయన ఆవిర్భవించిన క్షేత్రంగా తూర్పు గోదావరి జిల్లాలోని 'పిఠాపురం' అలరారుతోంది.

దత్తాత్రేయుని భక్తులైన అప్పలరాజు - సుమతి అనే అన్యోన్య దంపతులకు ఇచ్చిన మాట మేరకు వారి బిడ్డగా శ్రీ పాదవల్లభుల వారు జన్మించారు. బాల్యంలోనే ప్రజలకు ఆచార వ్యవహారాలను గురించీ, శాస్త్రాలలోని అర్థాలను ... పరమార్థాలను గురించి వివరించేవాడు. ఆయన అనుగ్రహంతో రజకుడు ... రాజైన సంఘటన మనకి గురుచరిత్రలో దర్శనమిస్తుంది. ఇలా అనేక మహిమలు చూపిన శ్రీపాదుల వారిని ఇక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ వుంటారు.

నిరంతరం ఈ క్షేత్రంలో '' దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ... దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా'' అనే నామసంకీర్తనం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. దేవదేవతలు యజ్ఞ యాగాదులు నిర్వహించిన కారణంగా, శ్రీపాదుల వారు అవతరించిన కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తుంటారు. ప్రతి నిత్యం ఇక్కడ స్వామివారి స్వర్ణ పాదుకలకు అభిషేకాదులు నిర్వహిస్తుంటారు. ప్రతి గురువారం స్వామివారిని వెండి పల్లకిలో ఊరేగిస్తారు. ఈ పల్లకిని మోయడం ద్వారా మనసులోని కోరికలు నెరవేరతాయని చెబుతుంటారు.

విశేషమైనటువంటి పర్వదినాల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఈ సందర్భాల్లో ఇక్కడ స్వామివారికి లక్ష బిల్వార్చన ... లక్ష తులసి అర్చన కూడా చేస్తుంటారు. శ్రీపాద వల్లభుడిని మూడుమార్లు స్మరించుకున్నంత మాత్రానే ఆయన తక్షణమే వచ్చి ఆపదల నుంచి కాపాడతాడని స్థానికులు చెబుతుంటారు. ఆయన దర్శనమాత్రంచేతనే సమస్త పాపాలు నశించి, పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని అంటారు.


More Bhakti News