ధన్వంతరీ క్షేత్రం

పూర్వ జన్మ పాపాలు వ్యాధుల రూపంలో మానవులను పట్టి పీడిస్తుంటాయి. కుటుంబంలో ఏ ఒక్కరికి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా మిగతా వారికి కూడా మనఃశాంతి వుండదు. ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ వాటిని అనుభవించాలంటే ఆరోగ్యం సరిగ్గా వుండాలనే విషయం అప్పడు బోధపడుతుంది. ఈ కారణంగానే ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని అంతా విశ్వసిస్తుంటారు.

ఏ దేవాలయాలకి వెళ్లినా సిరిసంపదలను ... ఉన్నత పదవులను అనుగ్రహించమని కోరే వారికన్నా, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరే వారే ఎక్కువగా వుంటారు. ఇలాంటి భక్తులను అనుగ్రహించడానికి అవతరించిన దేవుడే 'శ్రీ ధన్వంతరి స్వామి'. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే ధన్వంతరి, తమిళనాడులోని వేలూరు జిల్లాలో 'కీల్ పుదుపేట' గ్రామంలో దర్శనమిస్తుంటాడు. వైద్యానికి ఆదిగురువు అయిన ధన్వంతరి, 'స్టెతస్కోపు' మెడలో ధరించి దర్శనమిస్తూ వుండటం విశేషం.

వ్యాధులతో బాధపడుతున్న వారు స్వామి వారిని దర్శించి, తమకి స్వస్థత చేకూర్చమని ప్రార్ధిస్తుంటారు. ప్రాచీన కాలంలో సిద్ధవైద్యానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టినవారి ప్రతిమలు ఇక్కడ లింగరూపంలో కొలువుదీరి కనిపిస్తుంటాయి. అంతే కాకుండా వివిధ జన్మ నక్షత్రాలు ... ఆ నక్షత్రాల వారికి వచ్చే వ్యాధులు ... వాటి నివారణకి ఉపయోగించే ఔషధాల మొక్కలను ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ మొక్కలను పూజించడం వలన ఆయా వ్యాధుల బారి నుంచి బయట పడతారని చెబుతుంటారు.

ఇక్కడి వచ్చిన భక్తులు తమ వ్యాధిని గురించి చెప్పి అందుకు సంబంధించిన ఔషధాలను ప్రసాదంగా పొందుతుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రం ప్రకృతి వైద్యానికి పెట్టింది పేరుగా విరాజిల్లుతోంది. మానసిక ... శారీరక ఆరోగ్యాన్ని అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.


More Bhakti News