అయోధ్య

అవతారమూర్తిగా ... ఆదర్శమూర్తిగా ... ధర్మస్వరూపుడిగా నిలిచిన రాముడు, అశేష ప్రజానీకం గుండెల్లో కొలువుదీరిన కొండంత దేవుడు. కుమారుడిగా .. సోదరుడిగా .. శిష్యుడిగా .. భర్తగా .. ప్రభువుగా .. తండ్రిగా ధర్మ మార్గాన్ని ఆచరించి చూపిన పుణ్య పురుషుడు రాముడు. ఆ మహనీయుడు అవతరించిన పుణ్య భూమియే 'అయోధ్య'.

శ్రీ రాముడి పాద ధూళిచే పవిత్రమైన ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ సమీపంలో 'సరయూనది' ఒడ్డున అలరారుతోంది. మారుమూల గ్రామాల్లో సైతం రాముడుని దర్శించుకోకుండా ఆయన ఆలయాన్ని దాటి ముందుకి వెళ్లడానికి మనస్కరించదు. అలాంటిది ఆయన జన్మించిన అయోధ్యను చూసి అక్కడి నుంచి వెంటనే వెనక్కి మళ్లడం ఎవరికైనా కష్టంగానే వుంటుంది.

అయోధ్యలో అడుగుపెట్టాలంటే అందుకు పూర్వజన్మ సుకృతం వుండాలి. శ్రీరాముడిని స్మరిస్తూ ఆ నేలపై అడుగుపెట్టాక, అయోధ్య వేదికగా రామాయణంలో ప్రస్తావించిన ఘట్టాలు కళ్లముందు కదలాడతాయి. శ్రీ రాముడి బాల్యానికి ... యవ్వనానికి ... ధర్మబద్ధమైన ఆయన పరిపాలనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి, చివరికి ఆయనను తనలో కలిపేసుకున్న సరయూనదిని చూస్తే మనసు భారమౌతుంది. రాముడు లేని రాజ్యంలో మనమెందుకు వుండటం అనిపిస్తుంది.

ఆనాటి జ్ఞాపకాలుగా ఇక్కడ అనేక ప్రదేశాలు దర్శన మిస్తుంటాయి. సీతారాముల ఆలయం ... లక్ష్మణుడి మందిరం ... హనుమాన్ మందిరం ... కుశుడు నిర్మించిన ఆలయం ... సీతాదేవికి కైకేయి కానుకగా ఇచ్చిన భవనం ... వాల్మీకి మందిరం ... బాలరాముడి మందిరం ... సీతాదేవి పూజించిన దేవకాళీ మందిరం ఇక్కడ కొలువుదీరి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ప్రాచీనకాలం నాటివే. వీటిని వీక్షిస్తూ ఉన్నంత సేపు రాముడి కాలంలో వున్నట్టుగానే అనిపిస్తుంది.

అనుబంధాల నెలవుగా ... ఆదర్శాల కొలువుగా కనిపించే ఇక్కడి ప్రదేశాలు చూస్తుంటే, సీతారాములు విగ్రహాలుగా పాలరాతి మందిరాల్లోనే కాదు, ప్రతి ఒక్కరి మనసు మందిరంలోను కొలువుదీరి ఉన్నారనే భావన కలుగుతుంది. ఈ ఆలయాల్లో విశేషమైనటువంటి పుణ్యదినాల్లో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. సరయూనది సాక్షిగా ఆ ఉత్సవాలను తిలకించేందుకు వేలసంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు ... సీతారాముల ఆశీస్సులు అందుకుని తరిస్తూ వుంటారు.


More Bhakti News