హరిహర క్షేత్రం

హరిహర క్షేత్రాలుగా వెలుగొందుతోన్న పుణ్యక్షేత్రాలలో 'పాలకుర్తి' ఒకటి. ఇక్కడ 'క్షీరగిరి'గా పిలవబడే కొండపైనే శివకేశవులు కొలువుదీరి కనిపిస్తుంటారు. ప్రాచీన వైభవాన్ని కలిగి వున్న 'క్షీరగిరి' కారణంగానే ఈ ప్రాంతానికి 'పాలకుర్తి' అనే పేరు వచ్చిందని అంటారు. వరంగల్ జిల్లాలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పూర్వం మునులు తపస్సు చేసుకున్నట్టుగా చెబుతుంటారు.

ఇక్కడి కొండపై రెండు గుహలు కనిపిస్తుంటాయి. ఒక గుహలో 'సోమేశ్వరుడు' గా పిలవబడుతోన్న శివుడు, మరో గుహలో లక్ష్మీనృసింహ స్వామి దర్శనమిస్తుంటారు. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం ఒకప్పుడు తపోభూమిగా వెలుగొందిందనీ, ఆ మహర్షుల కోరికమేరకే శివకేశవులు ఇక్కడ ఆవిర్భవించారని అంటారు.

అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో ఈ కొండపై నుంచి ఓంకారం వినిపిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. అలా ఓంకార ధ్వనిని విన్నవారు ... స్వామి మహిమలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్న వారు ఇక్కడ కనిపిస్తారు. మహిమాన్వితమైన క్షేత్రం కనుకనే ఎందరో రాజులు ... మరెందరో మహనీయులు హరిహరులను సేవించి తరించారు.

ఈ పాలకొండ ... తమ పాలిట పాలకుండగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి కోనేటి తీర్థం సర్వపాపాలను హరించి వేస్తుందని అంటారు. పర్వదినాల సమయంలో అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విశేష పూజల్లోనూ ... ఉత్సవాలలోను భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ వుంటారు.


More Bhakti News