పిఠాపురం

వివిధ రాజ వంశీకుల ఏలుబడిలో ... ఆధ్యాత్మిక వాతావరణంలో 'పిఠాపురం' విలసిల్లుతూ వస్తోంది. పిష్ఠపురం ... పీఠికాపురం అనే పేర్లను పూర్వ నామాలుగా కలిగిన ఈ క్షేత్రం ఆలయాల సమాహారంగా కనిపిస్తుంది ... ఆధ్యాత్మికతకు ప్రధాన కేంద్రంగా అనిపిస్తుంది. శ్రీ పురుహూతికాదేవి శక్తి పీఠంగా ... దత్తాత్రేయ స్వామి క్షేత్రంగా ... 'పాదగయ'గా ... శ్రీ కుక్కుటేశ్వరస్వామి క్షేత్రంగా ... కుంతీమాధవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న పిఠాపురంలో అనేక ఉపాలయాలు కూడా దర్శనమిస్తుంటాయి.

కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో ఒకప్పుడు బౌద్ధ - జైన సంప్రదాయాలు కూడా విలసిల్లినట్టు ఈనాటికీ ఆధారాలు కనిపిస్తున్నాయి. శాతవాహనులు ... విష్ణు కుండినులు ... బాదామీ చాళుక్యులు ... తూర్పు చాళుక్యులు ... రెడ్డిరాజులు ఇలా ఎన్నో రాజవంశాలవారు పిఠాపురాన్ని పరిపాలించారు. ఆధ్యాత్మిక మార్గాన వారికి గల ఆసక్తిని బట్టి క్షేత్రాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు.

ఇక్కడి కుంతీమాధవ క్షేత్రానికి కూడా ఎంతో విశిష్టత వుంది. వృతాసురుడిని సంహరించిన దేవేంద్రుడు ఆ పాపాన్ని నివృత్తి చేసుకోవడం కోసం అయిదు ప్రదేశాల్లో మాధవస్వామిని ప్రతిష్ఠించాడు. కాశీలో 'బిందుమాధవస్వామి'ని ... ప్రయాగలో 'వేణుమాధవస్వామి'ని ... రామేశ్వరంలో 'సేతుమాధవస్వామి'ని ... కేరళలో 'సుందరమాధవస్వామి'ని ప్రతిష్ఠించిన ఇంద్రుడు, పిఠాపురంలో 'కుంతీమాధవస్వామి'ని ప్రతిష్ఠించి పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ కుక్కుటేశ్వరస్వామికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శక్తి పీఠంగా అలరారుతోన్న పురుహూతికా దేవికి వసంత నవరాత్రి ఉత్సవాలు ... శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక మార్గశిర మాసంలో దత్తాజయంతిని పురస్కరించుకుని విశేష పూజలు జరుగుతుంటాయి.

ఇంతమంది దేవతలు కొలువుదీరిన పిఠాపురాన్ని దర్శించడం వలన సమస్త పుణ్య క్షేత్రాలను దర్శించినంతటి పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని చెబుతుంటారు. ఈ కారణంగానే ఏడాది పొడవునా ఈ క్షేత్రం భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది.


More Bhakti News