శ్రీ జోడీ ఆంజనేయుడు

సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా గర్భాలయంలో ఒక మూలవిరాట్టు మాత్రమే కొలువుదీరి వుంటుంది. అలా కాకుండా రెండు మూలమూర్తులు కొలువై ఉంటే దాని వెనుక ఆసక్తికరమైన కథ ఏదో వుండే తీరుతుంది. ఇలాంటి నేపథ్యం మనకి అగ్రహారం ఆంజనేయస్వామి విషయంలో కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని అగ్రహారంలో హనుమంతుడి ఆలయం దర్శనమిస్తుంది.

గర్భాలయంలో 'భక్తాంజనేయుడు' ... 'వీరాంజనేయుడు' అనే రెండు మూలమూర్తులు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి. ఇలా రెండు మూలమూర్తులు కొలువై వున్న కారణంగానే ఇక్కడి స్వామిని 'జోడీ ఆంజనేయస్వామి'అని భక్తులు పిలుస్తూ వుంటారు. పూర్వం ఒక భక్తుడు వ్యాపార వ్యవహారాల నిమిత్తం ఈ ప్రదేశం మీదుగా వెళుతూ ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడట. అప్పుడు ఆంజనేయుడు అతని కలలో కనిపించి తాను అదే ప్రదేశంలో ఉన్నాననీ, తన రెండు ప్రతిమలను ఒకేచోట ప్రతిష్ఠించమని చెప్పాడట.

మెలకువ రాగానే ఆ పరిసరాల్లో వెదికిన ఆ భక్తుడికి స్వామివారి రెండు ప్రతిమలు కంటపడ్డాయి. దాంతో అక్కడే ఆలయాన్ని నిర్మించి స్వామివారి ప్రతిమలను ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి స్వామివారికి నిత్యార్చనలు ... విశేష పూజలు ... సిందూరాభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడి ఆంజనేయుడు కార్య సిద్ధిని కలిగిస్తాడనీ ... ఆయురారోగ్యాలను అందిస్తాడని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో ఎవరు ఏ కార్యాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

ఆలయ ప్రవేశ ద్వారం చెంతకు చేరుకోవడానికి ముందుగానే ఆరుబయట అభయాంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. బయట ప్రాకారాలపై అందంగా మలచబడిన దశావతారాల ప్రతిమలు ఆకట్టుకుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో తీర్చిదిద్దినట్టుగా కనిపించే ఆలయంలో పరమశివుడు ... సరస్వతీదేవి ... నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఆయా పుణ్య తిథుల్లో ఉపాలయాల్లోను విశేష పూజలు జరుగుతూ వుంటాయి.


More Bhakti News