శ్రీ విల్లిపుత్తూర్

ఆదిశేషుడిపై శయనముద్రలో కనిపించే శ్రీరంగనాథస్వామి ... వటపత్రశాయిగా పూజలు అందుకుంటోన్న మహిమాన్వితమైన క్షేత్రమే 'శ్రీ విల్లిపుత్తూర్'. శ్రీ రంగనాథ స్వామివారి భక్తులైన విల్లి - పుత్తర్ అనే కిరాత రాజులు నిర్మించిన కారణంగా ఈ క్షేత్రానికి 'విల్లి పుత్తూర్' అనే పేరు వచ్చింది. ఇది తమిళనాడు - మధుర సమీపంలో అలరారుతోంది.

ఒకానొక కల్పాంతం జరిగాక సమస్తం జలమయమయ్యాక, ఆ నీటిపై శ్రీ మహా విష్ణువు ... మర్రి ఆకుపై తేలుతూ ఈ ప్రదేశానికి వచ్చాడు. ఇక్కడ తాను అర్చావతారంగా కొలువుదీరాలని అప్పుడే ఆయన సంకల్పించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఇక్కడి స్వామి 'వటపత్రశాయి'గా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్వామివారిని రంగమన్నార్ పెరుమాళ్ అనీ ... అమ్మవారిని ఆండాళ్ తాయార్ అని భక్తులు పిలుచుకుంటూ వుంటారు.

108 దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధిచెందిన ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రతి ఉదయం 'తిరుమంజనం' జరుగుతుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఇక్కడి స్వామివారిని ఎందరో రాజులు పూజించి పునీతులయ్యారు. ఆలయ నిర్మాణంలోను ... అభివృద్ధి కార్యక్రమాల్లోను పాండ్య ... చోళ ... విజయనగర రాజులు ... మధుర నాయక రాజులు పాలుపంచుకున్నారు. ప్రధాన ఆలయం ... ఉపాలయాలు ... రాజగోపురం ... పుష్కరిణి ... మంటపాలు ... వాటిపై గల శిల్పకళను పరిశీలిస్తే, నాటి రాజులు ఈ ఆలయం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నది స్పష్టంగా తెలుస్తుంది.

లక్ష్మీనృసింహస్వామి ఆలయం ... వరాహ స్వామి మందిరం ... ఆళ్వారుల మందిరాలు భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటాయి. ఇక ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంలో జరిగే 'రథోత్సవం' ... 'తెప్పోత్సవం' చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. కోరిన వరాలను ప్రసాదించే వటపత్ర శాయిని కనులారా వీక్షించి మనసారా తరించడానికి భక్తులు లక్షలాదిగా ఇక్కడికి తరలివస్తుంటారు.


More Bhakti News