గుడివాడ

భగవంతుడికి భక్తుడి మనసుకి మించిన మందిరం లేదు. అంతకన్నా అత్యున్నతమైన స్థానంలో వుండాలని ఆయన కోరుకోడు కూడా. ఇక భక్తుడి విషయానికి వస్తే తన మనసులోని దేవుడిని అందరూ దర్శించి తరించాలని ఆరాటపడతాడు ... అందుకోసం ఆలయాల నిర్మాణాన్ని చేపడతాడు. అలా కొలువైనదే 'శ్రీ వేంకటేశ్వరస్వామి' ఆలయం. నయనమనోహరంగా స్వామివారు దర్శనమిచ్చే ఈ క్షేత్రం గుడివాడ - జగన్నాథపురంలో కనిపిస్తుంది.

ఆపదమొక్కులవాడిగా అందరిచే పిలవబడుతోన్న వేంకటేశ్వరుడుకి ఏ లోటు రానీయకూడదనే ఇక్కడి దాతల ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. ఆలయ నిర్మాణం వారి అంకిత భావానికి అద్దంపడుతూ వుంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజ్యలక్ష్మీదేవి మందిరం ... శ్రీ ఆండాళ్ అమ్మవారి మందిరం కొలువైవుంటాయి. ఇక ఒకే మందిరంలో 13 మంది ఆళ్వారులు కొలువుదీరి వుండటం ఇక్కడి విశేషంగా చెబుతారు. యజ్ఞ యాగాలు నిర్వహించడం కోసం జరిగిన యాగశాల నిర్మాణం ... దానిపై సప్త ఋషుల ప్రతిమలను తీర్చిదిద్దిన తీరు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత వన్నె తెస్తుంటాయి.

ఆలయ నిర్మాణ సమయంలో ఓ ప్రదేశంలో తరచూ ఓ సర్పం అక్కడక్కడే తిరుగాడుతూ ఉండేదట. దానిని నాగదేవత సూచనగా భావించిన భక్తులు, అక్కడే నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించి పూజిస్తూ వస్తున్నారు. 'ఉగాది' రోజున ... 'వైకుంఠ ఏకాదశి' రోజున ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు ... పవిత్రోత్సవాలు ... అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక ఇక్కడి అద్దాల మంటపంలో స్వామివారికి జరిగే 'పవళింపుసేవ' వేడుకను చూసి తీరవలసిందే.


More Bhakti News