పాపనాశన తీర్థ మహాత్మ్యం

తెలిసి చేసినా...తెలియక చేసినా పాపపుణ్యాలు తూకం వేయబడుతూనే వుంటాయి. వాటి ఫలితాలు వెదుక్కుంటూ వస్తూనే వుంటాయి. అయితే సాధ్యమైనంత వరకూ పాపాలను తొలగించుకోవాలనీ, పుణ్య ఫలాలను అందుకోవాలని అంతా ఆరాట పడుతుంటారు. తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం వివిధ పుణ్య క్షేత్రాలను దర్శిస్తుంటారు. అయినా తమ పాపాలు పూర్తిగా నశించాయో లేదోననే సందేహం వారిని పట్టి పీడిస్తూనే వుంటుంది. అలాంటి సందేహాలు కూడా 'పాపనాశన తీర్థం' కడిగేస్తుంది.

తిరుమల కొండలను మరింత పవిత్రం చేస్తోన్న పాపనాశన తీర్థం గురించి పురాణాలు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 'పాపనాశనం'లో స్నానమాచరించడం వలన సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా, సకల సంపదలు కలుగుతాయని అంటున్నాయి. అందుకు నిదర్శనంగా అవి యథార్థ సంఘటనలను సైతం ఆవిష్కరిస్తున్నాయి. పూర్వం 'భద్రమతి' అనే వేదపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. తన పాండిత్యాన్ని ఎవరూ గుర్తించని కారణంగా, అధిక సంతానం వలన పేదరికాన్ని అనుభవించసాగాడు.

దైవారాధన విషయంలో తాను ఎటువంటి లోపం చేయకపోయినా, కళ్ల ముందే భార్యా బిడ్డలు పస్తులు వుండటం అతనికి నరకప్రాయంగా తోచింది. అలాంటి పరిస్థితుల్లో భద్రమతికి 'పాపనాశన తీర్థం' గురించి ఆయన అర్థాంగి గుర్తుచేసింది. అందులో స్నానం చేసి ఎవరికైనా భూదానం చేయడం వలన తమ స్థితి బాగుపడవచ్చని చెప్పింది. దాంతో ఆ ఊరిలోని ఒక శ్రీమంతుడి దగ్గర కొద్దిపాటి భూమిని దానంగా గ్రహించి, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నాడు.

అంతా పాపనాశన తీర్థంలో స్నానమాచరించి ఆ భూమిని మరొక బ్రాహ్మణుడికి దానం చేశారు. ఆ రాత్రే శ్రీవేంకటేశ్వరుడు వారికి కలలో కనిపించి వారి పాపాలు నశించాయనీ, పుణ్య ఫలాలను అనుగ్రహిస్తున్నట్టుగా చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత కూడా ఇలాంటి అనుభవాలు పొందినవారు ఎందరోవున్నారు. పాపనాశన తీర్థ మహాత్మ్యం గురించి తెలిసిన వారు భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి పునీతులవుతుంటారు.


More Bhakti News