విరాట్ శిరిడీ సాయి

బాబా అంటే ... బాధలు తీర్చేవాడు ... బాధ్యతలు మోసేవాడు అని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. పిలిస్తే పలికే దైవంగా 'శిరిడీ సాయి' కున్న పేరు అంతా ఇంతా కాదు. రవ్వంత భక్తి శ్రద్ధలను కనబరిస్తే రత్నాలను అనుగ్రహించే వెన్నలాంటి హృదయం ఆయనది. ఎవరి కోసం తాను ఏం చేయాలో ... తన కోసం ఎవరితో ఏం చేయించాలనే విషయంలో ఆయన తీరు స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది.

సంకల్పం భక్తులదే అయినా ... అది నెరవేరే వరకూ దానిని వెంట వుండి నడిపించే నైపుణ్యం మనకి శిరిడీ సాయిలో మాత్రమే కనిపిస్తుంది. అలాంటి సంకల్పాన్ని ఒక భక్తుడికి కలిగించి ... ఆ సంకల్పం నెరవేరేలా చేశాడు బాబా. ఆ సంకల్పం 'విరాట్ శిరిడీ సాయిబాబా' గా ఆవిష్కృతం కాగా, ఆ విరాట్ స్వరూపం భక్తుల హృదయాలలోనే కాదు 'గిన్నిస్ బుక్'లో సైతం చోటు సంపాదించుకుంది. ఇంతటి ఘనతను సాధించిన ఈ క్షేత్రం మచిలీపట్నంలో దర్శనమిస్తుంది.

ఆరంభంలో ఇక్కడి ఆలయంలో తొమ్మిది అడుగుల శిరిడీసాయి విగ్రహం మాత్రమే వుండేది. నిలబడి దర్శనమిచ్చే ఈ విగ్రహం విశేషంగా అనిపిస్తుంది. అనతికాలంలోనే భక్తుల తాకిడి పెరగడంతో, విరాట్ శిరిడీ సాయిబాబా నిర్మాణానికి ఏర్పాట్లు జరిగాయి. ఫలితంగా ఇదే క్షేత్రంలో 54 అడుగుల ఎత్తు ... 45 అడుగుల వెడల్పుతో బాబా విగ్రహం రూపొందింది. దాంతో ప్రపంచంలోనే అతి పెద్ద శిరిడీసాయి విగ్రహంగా ఇది గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది.

నాగేంద్రుడి పడగ నీడలో సింహాసనం పై కూర్చుని అభయ హస్తాన్ని చూపే సాయినాథుడు, విశాలమైన ప్రదేశాన్ని ఆక్రమించుకున్నట్టుగా కనిపిస్తాడు. అంతకంటే విశాలమైన భక్తుల మనసులను ఆక్రమించుకున్నట్టుగా అనిపిస్తాడు. ప్రతి నిత్యం ఇక్కడి క్షేత్రంలో నాలుగు హారతులు జరుగుతాయి. ఇక రాత్రి వేళలో జరిగే పవళింపు సేవతో బాబా విశ్రాంతి తీసుకుంటాడు. ప్రతి గురువారం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక గురు పౌర్ణమితో పాటు మిగతా పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి.


More Bhakti News