శ్రీ చక్రేశ్వరాలయం

మహాభారతంలో మనకు 'బకాసురుడు' వృత్తాంతం ఆసక్తికరంగా అనిపిస్తుంది. బకాసురుడు అనే రాక్షసుడు తన ఆకలిని తీర్చుకోవడం కోసం ఓ గ్రామంపై విరుచుకుపడుతుండేవాడు. చేతికి దొరికిన పశువులను ... పక్షులను ... మనుషులను తినేస్తూ అందరినీ భయకంపితులను చేస్తుండేవాడు. ఇష్టానుసారంగా బకాసురుడు ప్రాణనష్టం కలిగించకుండా, ప్రతి రోజు ఒక్కో ఇంటి నుంచి బండెడు వంటకాలు ... ఆ ఇంటి నుంచి ఒక మనిషిని అతనికి ఆహారంగా సమర్పించనున్నట్టు బకాసురుడితో గ్రామస్తులు ఒప్పందం చేసుకున్నారు.

అలాంటి పరిస్థితుల్లోనే అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఆ గ్రామానికి చేరుకున్నారు. బకాసురుడి గురించి తెలుసుకున్న భీముడు, బండి నిండుగా వంటకాలు తీసుకుని స్వయంగా వెళతాడు. ఆ రాక్షసుడిని సంహరించి వాడి బారి నుంచి గ్రామస్తులను కాపాడతాడు. ద్వాపరయుగంలో ఈ సంఘటనలకు వేదికగా నిలిచిన ప్రాంతమే 'ఏక చక్రపురం'. ప్రస్తుతం ఇది నిజామాబాద్ జిల్లాలోని 'బోధన్' గా పిలవబడుతోంది. ఏక చక్రపురం గురించి పురాణాల్లో చెప్పిన భౌగోళిక అంశాలు నేటి బోధన్ తో సరిగ్గా సరిపోతున్నాయి.

పూర్వం క్షత్రియ సంహారం చేసిన కారణంగా తనకి చుట్టుకున్న పాపాలను నశింపజేసుకోవడం కోసం, పరశురాముడు వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లాడు. అలా ఆయన ఇక్కడ రామేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. భీముడు రావడానికి ముందు ... బకాసురుడి బారి నుంచి కాపాడమని 'శాండిల్య ముని' శివుడి గురించి తపస్సు చేసినది ఇక్కడే. ఆ తరువాత కాలంలో కనుమరుగైన ఈ ఆలయం 19 వ శతాబ్దంలో జరిగిన తవ్వకాల్లో బయటపడింది.

భక్తులు స్వామివారిని శ్రీ చక్రేశ్వరుడిగా పిలుచుకుంటూ పూజాభిషేకాలు నిర్వహిస్తున్నారు. శ్రావణ ... కార్తీక మాసాల్లోను, శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ విశేష పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన జీవితంలో ధనధాన్యాల కొరత ఏర్పడదని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News