రుద్రమంత్రం

రుద్రుడి మనసు గెలుచుకోవాలంటే 'రుద్ర మంత్రం' పఠించాలి ... 'రుద్రాభిషేకం' చేయాలి. మంత్రం మహా శివుడి మనసు కరిగిస్తుంది ... అభిషేకం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడాయన శాంతిస్తాడు ... ఆప్యాయంగా అనుగ్రహిస్తాడు. రుద్రమంత్రం ఎంతో విశిష్టమైనదనీ ... మరెంతో మహిమాన్వితమైనదని పురాణాలు సైతం స్పష్టంగా చెబుతున్నాయి. దరిద్రుడిని శ్రీమంతుడిగా ... అల్పాయుష్కుడిని చిరంజీవిగా చేయగల శక్తి రుద్ర మంత్రానికి వుందని అంటున్నాయి.

ఒకానొక సమయంలో అంతా రుద్ర మంత్రాన్ని పఠిస్తూ రుద్రాభిషేకం చేస్తూ పాపాలను కడిగివేసుకుంటూ ఉండటంతో, యమధర్మ రాజుకి పనిలేకుండా పోయిందట. దాంతో ఆయన విషయాన్ని బ్రహ్మ దేవుడి దృష్టికి తీసుకువెళ్లాడు. రుద్ర మంత్రానికి ... రుద్రాభిషేకానికి గల శక్తి గురించి ఆయన యమధర్మ రాజుకి వివరించాడు. రుద్ర మంత్రంతో స్నానం చేసిన వారి చెంతకు వెళ్లడానికి కూడా యమధర్మరాజు భయపడవలసిందేనని చెప్పాడట. దాంతో యమధర్మ రాజు చిన్నబుచ్చుకుని తిరుగుముఖం పట్టాడు.

ఇక ఈ రుద్ర మంత్రం ప్రస్తావన మనకు 'శ్రీ గురుచరిత్ర'లో కూడా కనిపిస్తుంది. ఒక రాజు ... జాతకం ప్రకారం తన ఇద్దరు కుమారులు మరో వారం రోజుల్లో మరణించడం ఖాయమని తెలుసుకుని కుమిలిపోతుంటాడు. ఆ గండం నుంచి వారు గట్టెక్కాలంటే ఈ వారం రోజుల పాటు వందమంది బ్రాహ్మణులు చేత పదివేల రుద్రమంత్ర జపం ... రుద్రాభిషేకం చేయించవలసి ఉంటుందని రాజుతో పరాశర మహర్షి చెబుతాడు. రాజు ఆ విధంగా చేసిన కారణంగా ఆయన కుమారులు గండం నుంచి బయటపడతారు.

మహిమాన్వితమైన రుద్ర మంత్రం గురించి తనకి తెలియజేసినందుకు ... తన వంశాన్ని నిలబెట్టినందుకు పరాశర మహర్షిని ఆ రాజు ఎంతగానో అభినందిస్తాడు. భక్తితో రుద్ర మంత్రం పఠించడం ... అంకిత భావంతో 'రుద్రాభిషేకం' చేయడం వలన, అవి జీవితాన్ని అత్యంత శక్తివంతంగా ప్రభావితం చేస్తాయి ... కోరిన వరాలను ప్రసాదిస్తాయని గ్రహించాలి.


More Bhakti News