గోరింటాకు

పండుగలు .. పర్వదినాలు వచ్చినా, శుభకార్యాల్లో పాల్గొనవలసి వచ్చినా అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటూ వుంటారు. ఇప్పుడంటే గోరింటాకు బదులుగా రసాయనాలతో తయారు చేయబడినవి వాడుతున్నారు గానీ, ఒకప్పుడు గోరింటాకు చెట్టులేని ఇల్లు వుండేది కాదు. ఒకవేళ అలా గోరింటాకు చెట్టు లేనట్టయితే దానికోసం వెదకడంలోను ... సంపాదించడంలోను అమ్మాయిలు ఆనందాన్ని పొందేవారు.

ఇక కాస్త ఖాళీ దొరికిందంటే చాలు అమ్మాయిలంతా కలిసి తమకి నచ్చిన విధంగా గోరింటాకు పెట్టుకుంటూ వుంటారు. కాళ్లకి పారాణి ... అరచేతుల్లో చందమామ ... దాని చుట్టూ చుక్కలు పెడుతుంటారు. అలా పెట్టుకున్న గోరింటాకు పండటాన్ని బట్టి, పెద్దలు చెప్పే అర్ధాలు వింటూ మురిసిపోతుంటారు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఈ తీరు మనకి కనిపిస్తూనే వుంటుంది. మిగతా రోజుల మాట ఎలా వున్నా ఆషాడ మాసంలో మాత్రం తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలా వాళ్లు చెప్పడం వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా కనిపిస్తాయి.

ఆషాడ మాసంలో వానలు ఎక్కువగా కురుస్తుంటాయి. యువతులు నీళ్లతో ముడిపడిన పనులు ఎక్కువగా చేస్తుంటారు. ఈ కారణంగా వారి పాదాలు ... అరచేతులు నీళ్లలో నానడం వలన వ్యాధులు సోకే అవకాశం వుంటుంది. వాటి బారినుంచి కాపాడుకోవడానికి గోరింటాకు మంచి మందులా పనిచేస్తుంది. అందునా వానా కాలంలో గోరింటాకు చిగురించి కావలసినంత దొరుకుతుంది. అందుకే పెద్దలు గోరింటాకు పెట్టుకోవడాన్ని ఆచారాల్లో ఒక భాగాన్ని చేశారని అర్థమవుతుంది.


More Bhakti News