సంపదనిచ్చే కుబేరుడు

ఈ విశ్వంలో సంపద ఏదైనా ... అది ఏ రూపంలో వున్నా దానికి అధిపతి కుబేరుడే. పద్మ ... మహాపద్మ ... శంఖ ... మకర ... కచ్చప ... ముకుంద ... కుంద ... నీల ... వర్చస అనే 'నవ నిధులు' ఆయన అధీనంలో వుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది?

కుబేరుడి తల్లిదండ్రులు విశ్రావసుడు - ఇలవిల. ఈ కారణంగానే కుబేరుడిని 'వైశ్రవణుడు' అనీ ... ఐల్వల్యుడు అని పిలుస్తుంటారు. తన కఠోరమైన తపస్సుచే బ్రహ్మదేవుడిని మెప్పించి, ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని ... నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించాడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగివుండి ... మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. ఆయన చుట్టుపక్కల నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి.

కుమారులైన మణిగ్రీవ - నలకూబరులే కాకుండా, అనేకమంది దేవతలు ఆయనను పూజిస్తుంటారు. ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకుని, తనని పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు. ఈ కారణంగానే చాలామంది ఆయనను 'దీపావళి' రోజున పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో ...అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే, అనతికాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు.


More Bhakti News