భావనారాయణ స్వామి

శ్రీమన్నారాయణుడు ... భూలోకంలోని అనేక పవిత్రమైన ప్రదేశాలలో భావనారాయణ స్వామిగా అవతరించి పూజలందుకుంటున్నాడు. అలా భావనారాయణ స్వామిగా ఆయన కొలువుదీరిన క్షేత్రాలలో 'పెదగంజాం' ఒకటి. ఇటు ఆధ్యాత్మిక సంపదను ... అటు చారిత్రక సంపదను కలిగివున్న ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో దర్శనమిస్తుంది.

ఇక ఇక్కడ స్వామివారు ఆవిర్భవించదానికి గల కారణాన్ని పరిశీలిస్తే, పూర్వం గరుత్మంతుడి తల్లి అయిన 'వినత' స్వామిని గురించి కఠోర తపస్సును ఆచరించింది. ఆమె తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆమె కోరిక మేరకు ఈ ప్రదేశంలో భావనారాయణ స్వామిగా అవతరించాడు. అప్పటి నుంచి ఎంతోమంది మహర్షులు ఇక్కడి స్వామివారిని దర్శించి తరించారు.

కాలక్రమంలో వందల యేళ్లు గడిచినా ఇక్కడి స్వామివారు తమ వైభవాన్ని కోల్పోలేదు. క్రీ.శ.7 వ శతాబ్దంలో ఆనాటి పాలకులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. ప్రాచీన కాలంనాటి నిర్మాణ నైపుణ్యం ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన భక్తులను ఆశ్చర్య పరుస్తుంది. భక్తుల బాగోగులను భావనారాయణ స్వామి ఓ కంట కనిపెడుతూనే ఉంటాడని ఇక్కడి వారు విశ్వసిస్తుంటారు. ప్రతి యేటా అక్టోబర్ మాసంలో స్వామివారి పాదాలను సూర్య కిరణాలు తాకడం ఇక్కడి విశేషం. ఈ సందర్భంలో ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది.


More Bhakti News