మనసుదోచే మాధవుడు

పురాణాలు ... ఇతిహాసాలు చదువుతున్నప్పుడు, ఆసక్తికరమైన కొన్ని సంఘటనలు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలనిపిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో మనకి రామాయణ ... మహాభారత ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు దర్శనమిస్తుంటాయి. అయితే వినాయక చవితి వ్రత కథలో 'శమంతకమణి' విషయంలో శ్రీ కృష్ణుడు ... జాంబవంతుడు యుద్ధం చేసిన ప్రదేశం కూడా ఫలానా చోట వుందంటే, వెంటనే ఆ క్షేత్రాన్ని కూడా చూడాలనిపిస్తూ వుంటుంది. అలాంటి వారందరికీ 'మన్నారు పోలూరు' క్షేత్రం ఆహ్వానం పలుకుతోంది.

సత్యభామ .. జాంబవతి సమేతంగా శ్రీ కృష్ణుడు కొలువుదీరిన ఈ క్షేత్రం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట సమీపంలో విరాజిల్లుతోంది. ద్వాపర యుగంలో సత్రాజిత్తుకు సూర్యుడు 'శమంతకమణి' ని ప్రసాదించాడు. ఆ శమంతకమణిని శ్రీ కృష్ణుడు కోరినప్పటికీ ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరిస్తాడు. ఆ మణి గల హారాన్ని ధరించిన సత్రాజిత్తు సోదరుడు ప్రసేనజిత్తు వేటకి వెళతాడు. అక్కడ ఓ సింహం బారినపడి అతను చనిపోగా, ఆ మణి జాంబవంతుడికి దొరుకుతుంది.

అయితే తన సోదరుడి మరణానికి ... శమంతకమణి కనిపించకుండా పోవడానికి శ్రీ కృష్ణుడే కారణమని సత్రాజిత్తు భావిస్తాడు. ఆ నింద నిజం కాదని నిరూపించడం కోసం శమంతకమణిని వెదుక్కుంటూ వెళ్లిన శ్రీ కృష్ణుడు, ఓ ప్రదేశంలో జాంబవంతుడితో పోరాడి మణిని చేజిక్కించుకుంటాడు. ఆ సందర్భంలోనే తన కూతురిని శ్రీ కృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు జాంబవంతుడు.

ఇక శ్రీహరి అవతారమైన శ్రీ కృష్ణుడు జాంబవంతుడితో మల్ల యుద్ధం చేసిన కారణంగా, ఈ ప్రదేశానికి 'మల్ల హరి పోరు' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది 'మన్నారు పోలూరు'గా మార్పు చెందినదని అంటారు. ఇక్కడి కృష్ణుడు నయనమనోహరంగా దర్శనమిస్తుంటాడు. 10 వ శతాబ్దం తరువాత వచ్చిన రాజుల కారణంగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.


More Bhakti News