గురువాయూర్

వైష్ణవ భక్తులు పరమ పవిత్రమైనదిగా భావించే పుణ్యక్షేత్రం 'గురువాయూర్'. శ్రీ కృష్ణుడు ... చిన్ని కృష్ణుడిగా దర్శనమిస్తోన్న ఈ క్షేత్రం కేరళలోని త్రిసూర్ జిల్లాలో విరాజిల్లుతోంది. నాలుగున్నర అడుగుల ఎత్తుగల చిన్ని కృష్ణుడు శంఖు చక్రాలను ... గదా పద్మాలను ధరించి దర్శనమిస్తుంటాడు. ఈ బాలగోపాలుడిని భక్తులు బాలకృష్ణన్ అనీ ... ఉన్నికృష్ణన్ అని పిలుస్తూ వుంటారు.

అశేష భక్త జనకోటి స్వామివారిని దర్శించుకోవడానికి ఆరాటపడటంలో అర్ధం వుంది. ఎందుకంటే ఇక్కడి ఆలయం ఎంతో ప్రాచీనతను సంతరించుకుంది. బ్రహ్మ ... విష్ణు ... మహేశ్వరులు సైతం ఈ కృష్ణుడిని ఆరాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడి కాలంలోనే ద్వారకలో ప్రతిష్ఠించబడి ఈ విగ్రహం పూజలందుకున్నట్టుగా స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది.

శ్రీ కృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తూ, సముద్ర గర్భాన ద్వారక కలిసిపోయే సమయం ఆసన్నమైందనీ ... ఆ సమయంలో ఈ విగ్రహం నీటిపై తేలుతుందనీ ... దానిని బృహస్పతికి అందజేయమని ఉద్ధవుడితో చెప్పాడట. ఉద్ధవుడు చెప్పిన ప్రకారం దేవతల గురువైన బృహస్పతి ... వాయుదేవుడి సహాయంతో ఈ ప్రదేశానికి వచ్చాడు. శివుడి సూచనమేరకు ఈ విగ్రహాన్ని ఇక్కడి కోనేటి గట్టున ప్రతిష్ఠించాడు. గురువు ... వాయువు సహాయంతో కృష్ణుడిని ప్రతిష్ఠించిన కారణంగానే ఈ క్షేత్రానికి 'గురువాయూర్' అనే పేరు వచ్చింది.

మొదటిసారిగా ఈ చిన్ని కృష్ణుడికి ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా, ఆ తరువాత కాలంలో అనేక మంది రాజవంశీకులు ఈ క్షేత్ర అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఇక్కడి స్వామివారిని ప్రతిరోజు పాలు ... కొబ్బరి నీళ్లతో అభిషేకించి, పట్టు పీతాంబరాలతో అలంకరణ చేస్తారు. పాయసం ... కొబ్బరి లడ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ అన్నప్రాశనలు ... వివాహాలు విశేష సంఖ్యలో జరుగుతుంటాయి.

భక్తులు తమ కోరిక నెరవేరగానే అరటి పండ్లు ... కొబ్బరి కాయలు ... బెల్లం దిమ్మలతో 'తులాభారం' తూగి వాటిని స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇక 'కృష్ణాష్టమి' రోజున స్వామివారి వైభవాన్ని చూడాల్సిందే గాని మాటల్లో చెప్పలేం. ఈ ఉత్సవాల్లో గజరాజులు ఉత్సాహంగా పాలుపంచుకుంటూ, తమ జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ వుంటాయి.


More Bhakti News