కాంచీపురం

ప్రాచీనకాలం నాటి అనేక ఆలయాల సముదాయం 'కాంచీపురం'. భారతీయ ఆధ్యాత్మిక ఆనవాళ్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సప్తమోక్ష పురాల్లో ఒకటైన ఈ క్షేత్రం కృతయుగంలో బ్రహ్మ ... త్రేతా యుగంలో గజేంద్రుడు ... ద్వాపర యుగంలో బృహస్పతి చేత పూజించబడి, కలియుగాన ఆది శేషునిచే ఆరాధించబడుతోంది.

ఇటు ఆధ్యాత్మిక వైభవాన్ని ... అటు చారిత్రక ఘనతని సొంతం చేసుకున్న ఈ క్షేత్రం, అనేకమంది రాజవంశీయులచే అభివృద్ధి చెందుతూ వచ్చింది. వీరిలో పల్లవులు ... చోళులు ... విజయనగర రాజులు ప్రధానంగా కనిపిస్తారు. ఆశ్చర్యచకితులను చేసే అద్భుతమైన ఆలయ నిర్మాణం నాటి రాజుల అంకిత భావానికి అద్దం పడుతూ ఉంటుంది.

ఇక్కడి ప్రతి స్తంభం ... ప్రతి మంటపంలోను శిల్పకళ తొణికిసలాడుతూ వుంటుంది. ఏకశిలా నిర్మాణాలు ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఇక్కడి స్వామివారిని 'వరదరాజ పెరుమాళ్' అని పిలుస్తూ వుంటారు. అమ్మవారు పెరుందేవి తాయార్ గా పూజలు అందుకుంటూ వుంటుంది. శ్రీ రామానుజాచార్యుల వారు ఇక్కడి స్వామివారికి తీర్థ కైంకర్యాలను నిర్వహించారు.

ఇక ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం కూడా చూడదగినది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రాచీనకాలం నాటి మామిడి చెట్టును గురించి విశేషంగా చెప్పుకుంటారు. ఈ మహా వృక్షానికిగల నాలుగు ప్రధానమైన కొమ్మలలో, ఒక్కో కొమ్మకి కాసిన మామిడి ఫలాలు ఒక్కో రుచిని కలిగివుంటాయి. దీనిని దైవలీలగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు.

శివ కేశవులిద్దరికీ విశేషమైన పర్వదినాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి. నిర్మాణ పరంగా ... శిల్పకళా పరంగా ... ఆధ్యాత్మిక పరంగా ... చారిత్రకపరంగా తన ఘనతను చాటుకుంటోన్న కాంచీపురం క్షేత్ర దర్శనం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News