సంకటహర చతుర్థి

వినాయకుడిని పూజించడం వలన ... ఏడాదికి ఒకసారి వచ్చే వినాయక చవితి రోజున ఆయనను అర్చించడం వలన విఘ్నాలతో పాటు విచారం కూడా తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి వినాయకుడి అనుగ్రహం కోసం 'సంకటహర చతుర్థి' వ్రతం చేస్తే లభించే పుణ్య ఫలాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇంచుమించు వినాయక చవితి వ్రతం మాదిరిగానే అనిపించే ఈ వ్రతం ... 'శ్రావణ బహుళ చవితి' రోజున చేయాలి.

ఉదయాన్నే తలస్నానం చేసి వినాయక వ్రతంలానే పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. బాల గణపతి .. బాలచంద్ర గణపతి .. కృష్ణ గణపతి .. వికట గణపతి .. సువర్ణ గణపతి .. అంబర గణపతి .. శుక్ల గణపతి .. నింబ గణపతి .. ధూమ్ర గణపతి .. లంబోదర గణపతి .. శక్తి గణపతి .. నిర్విఘ్న గణపతి .. రక్త గణపతి .. రుణవిమోచన గణపతి .. ఏకదంత గణపతి .. వక్రతుండ గణపతి .. చింతామణి గణపతి .. లక్ష్మీప్రద గణపతి .. సిద్ధి గణపతి .. లక్ష్మీ గణపతి ... విష్ణు గణపతి ... ఇలా 21 వినాయక రూపాలను పూజించాలి.

వినాయకుడి 21 రూపాలను 21 రకాల పత్రులతో ... 21 రకాల పువ్వులతో అర్చించాలి. వినాయకుడుకి ఇష్టమైన 21 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించి, 21 వత్తులను వెలిగించి హారతి ఇవ్వాలి. ఆ తరువాత 21 మంది బ్రాహ్మణులకు వినాయక విగ్రహాలతో పాటు పదార్ధాలను దక్షిణ తాంబూలాలతో పాటు దానమివ్వాలి.

ఈ విధంగా ఈ వ్రతాన్ని 21 సంవత్సరాల పాటు ఆచరించి 'వినాయక చవితి' రోజున ఉద్యాపన చెప్పుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే సీతారాములు ... శ్రీ కృష్ణుడు ... ధర్మ రాజు ... బలిచక్రవర్తి వంటి వారు తమ సంకటములను తొలగించుకున్నట్టు శాస్త్రాల్లో కనిపిస్తోంది.


More Bhakti News