మోపిదేవి

కృష్ణా నదీ తీరంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో 'మోపిదేవి' ఒకటి. 'మోహినీపురం' గా పురాణాలలో కనిపించే ఈ క్షేత్రం గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో వెలసింది. ఈ పుణ్య క్షేత్రంలో శ్రీ వల్లీ దేవసేన సమేతుడై కొలువుదీరిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఇక్కడి క్షేత్రాలలో తొలి స్థానం దీనికే దక్కుతుంది.

ఈ క్షేత్రం ఇక్కడ కొలువుదీరడానికి కారణమైన పురాణ కథను పరిశీలిస్తే, పూర్వం వింధ్య పర్వతం అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోసాగింది. దాంతో సూర్యుడి గమనం తెలియక దేవతలు ... మునులు అయోమయంలో పడిపోయారు. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా అంతా కలిసి కాశీ లోగల అగస్త్య మహర్షిని వేడుకున్నారు. దాంతో ఆయన తన అర్ధాంగి లోపాముద్ర తోను ... శిష్యులతోను కలిసి దక్షిణ దేశానికి బయలుదేరాడు.

మార్గమధ్యంలో వింధ్య పర్వతం వినయంగా వంగి అగస్త్యునికి నమస్కరిస్తూ దారినిచ్చింది. తాము వచ్చే వరకూ అలాగే ఉండమని చెప్పి వచ్చేసిన అగస్త్యుడు, ఇక అటు వెళ్లక ఆ పర్వతం అలానే ఉండేలా చేసి సమస్యను పరిష్కరించాడు. ఈ నేపథ్యంలో కృష్ణా తీరానికి చేరుకున్న అగస్త్యుడు ... ఒక చోట పాములు ... ముంగీసలు ... నెమళ్లు కలిసి సఖ్యతగా వుండటం చూసి ఆశ్చర్యపోయాడు.

ఒక పుట్టలో నుంచి దివ్య తేజస్సు వెలువడుతుండటం చూశాడు. ఆ పుట్టలో సుబ్రహ్మణ్యే శ్వర స్వామి ఉన్నాడని తెలుసుకున్న అగస్త్యుడు, సామాన్య ప్రజానీకానికి కూడా ఆయన దర్శన భాగ్యం లభించాలనే ఉద్దేశంతో పాము పడగా ఆకారం కలిగిన లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాత ఎందరో మహనీయులు ఇక్కడి స్వామిని పూజించారు.

కాలప్రవాహంలో ఆ విగ్రహం కనుమరుగైంది. ఆ తరువాత ఒక భక్తుడికి స్వామి కలలో కనిపించి తానున్న జాడ చెప్పి తనని బయటికి తీసి ప్రతిష్ఠించమని కోరడంతో, ఆ భక్తుడు అలాగే చేసి తన జన్మను చరితార్థం చేసుకున్నాడు. ఈ క్షేత్రంలో 'నాగుల చవితి' ... 'సుబ్రహ్మణ్య షష్ఠి' పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతుంటాయి. నాగదోష నివారణ కోసం ... చిన్న పిల్లలకి చెవులు కుట్టించడం కోసం ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.


More Bhakti News