బోనాలు

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో 'బోనాలు' ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటూ వుంటారు. తమని చల్లగా చూడమని కోరుతూ మహంకాళీ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ వుంటారు. కులీ కుతుబ్ షా కాలం నుంచి ఆనవాయతీగా హైదరాబాద్ లో గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ ప్రారంభమవుతుంది. ఆ తరువాత, జిల్లాలోని మిగతా ఆలయాల్లో జాతర సందడి మొదలవుతుంది.

గోల్కొండ అమ్మవారి పూజ జరిగిన తరువాత సికింద్రాబాద్ మహంకాళి ... లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. నెల రోజులపాటు ఘనంగా ... కన్నుల పండువగా జరిగే ఈ బోనాల ఉత్సవాలు, ఆషాడ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ అమ్మవారికి సమర్పించే బోనాలతో పూర్తవుతాయి. ఈ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చే ఆడపిల్లలు, తమ ఊరు అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు ... సంతాన సౌభాగ్యాలనే సంపదలను ప్రసాదించమని కోరుతూ వుంటారు.

ఈ ఉత్సవాలకు కేంద్ర స్థానంగా హైదరాబాదులోని ఉజ్జయిని మహంకాళీ దేవాలయం కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ ఉత్సవాల సందర్భంలో భక్తుల సందోహంతో ఆలయం కిటకిటలాడుతూ వుంటుంది. సికింద్రాబాద్ కి చెందిన ఓ భక్తుడు ఉజ్జయినిలో ఉద్యోగం చేస్తుండగా, అక్కడ కలరా వ్యాధి వ్యాప్తి చెందడం మొదలైంది. ఆ సమయంలో ఉజ్జయిని అమ్మవారికి మొక్కుకున్న ఆ భక్తుడు, తమని రక్షించిన అమ్మవారికి సికింద్రాబాద్ లో ఆలయాన్ని నిర్మించాడు. అలా ఈ ఆలయం దాదాపు 200 సంవత్సరాల చరిత్రను కలిగివుంది.

ఆ తరువాత ఈ ఆలయం ప్రభుత్వ అధీనంలోకి వెళ్లినా ... ఆ భక్తుడికి చెందిన వంశీకులే ఈ ఉత్సవాల్లో ప్రధాన పాత్రను పోషిస్తుంటారు. ఇక ప్రభుత్వం ఆనవాయతీ ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు కొత్తగా ఏ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా ... శుభకార్యాలు తలపెడుతున్నా ముందుగా అమ్మ దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సులు అందుకోవడం ఆనవాయతీగా వస్తోంది. వారి విశ్వాసానికి తగినట్టుగానే మహంకాళీ అమ్మవారు వారిని అనుగ్రహిస్తూ వుంది.


More Bhakti News