అభిషేక ఫలితం

చల్లని మనసున్న శివుడు ఎక్కడ చల్లగా వుంటే అక్కడ కొలువుంటాడు. ఆగకుండా అభిషేకం చేస్తూ వుంటే ఆనందంతో పొంగిపోతుంటాడు. శివుడు పుష్పాలతో చేసే పూజ కన్నా, తన గరళ కంఠాన్ని చల్లబరిచే అభిషేకాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఇందుకోసం ఆయన అనేక క్షేత్రాలలో భక్తులు తనకి స్వయంగా అభిషేకం చేసే అవకాశాన్ని కూడా కల్పించాడు.

సాధారణంగా శివుడిని పంచామృతాలు ( ఆవు పాలు .. ఆవు పెరుగు .. ఆవు నెయ్యి .. శుద్ధమైన జలం ... తేనె) తో అభిషేకిస్తూ వుంటారు. ఇక భస్మం తోను ... చందనం తోను కూడా ముక్కంటికి అభిషేకాలు చేస్తుంటారు. శివాలయంలోని అర్చక స్వాములు నమక చమకాలతో ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

పంచామృతాలతో చేసిన అభిషేకం వలన పుణ్య ఫలాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భక్తులు తమ కోరికను బట్టి స్వామికి అభిషేకం చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. మోక్షాన్ని కోరుకునే వారు శివయ్యకి నీటితో అభిషేకం చేయవలసి వుంటుంది. అలాగే సంతానాన్ని ఆశించేవారు స్వామికి పాలతో అభిషేకం చేయాలి.

ఇక ఆరోగ్యాన్ని కోరుకునే వారు పెరుగుతోను ... జ్ఞానాన్ని పొందాలనుకునే వారు నెయ్యితోను మహేశ్వరుడిని అభిషేకించాలి. సిరి సంపదలను ఆశించే వారు తేనెతో అభిషేకం చేయవలసి వుంటుంది. అభిషేకం విషయంలో ఈ విధానాన్ని ఆచరించడం వలన ఆశించిన ఫలితాలను పొందవచ్చునని చెప్పొచ్చు.


More Bhakti News