కేసరిగుట్ట

రావణ సంహారం అనతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటం కోసం కోటి శివలింగాలను ప్రతిష్ఠించమని శ్రీరామచంద్రుడితో అగస్త్య మహర్షి చెప్పాడు. దాంతో వివిధ ప్రదేశాల్లో రాముడు కోటి శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా ఆ పుణ్యపురుషుడు శివలింగాలను ప్రతిష్ఠించిన ప్రదేశాలు నేడు పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. అలాంటి పుణ్య క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది 'కేసరి గుట్ట'.

సీతారాములు ... లక్ష్మణ హనుమలు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు రాముడు. దాంతో శివలింగాన్ని కాశీ నుంచి తీసుకు రావడానికి వెళ్లాడు హనుమంతుడు. అయితే ముహూర్త సమయానికి హనుమంతుడు రాకపోవడంతో, శివుడిని ప్రార్ధించాడు రాముడు. దాంతో శివుడు లింగరూపంలో అవతరించాడు.

ఆ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించిన కొంత సేపటికే హనుమంతుడు అక్కడికి చేరుకున్నాడు. నాణ్యమైన శివలింగాన్ని రాముడే ఎంచుకుంటాడనే ఉద్దేశంతో హనుమంతుడు 101 శివలింగాలను తీసుకువచ్చాడు. అంతగా కష్టపడిన హనుమంతుడు చిన్నబుచ్చుకోవడం రాముడికి బాధ కలిగించింది. హనుమంతుడి శ్రమ వృధా కాదనీ ... కేసరి పుత్రుడైన అతని పేరుతోనే ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందుతుందని చెప్పాడు. నాటి నుంచి ఆ పేరుతోనే ఈ క్షేత్రం విలసిల్లుతోంది. హనుమంతుడు తెచ్చిన శివలింగాలను కూడా ఈ ప్రదేశంలో చూడవచ్చు.

రాముడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడి స్వామి రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ తరువాత కాలంలో అమ్మవారు భవాని పేరుతో ఇక్కడ ప్రతిష్ఠించబడింది. విశేషమైనటు వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోగల ఈ క్షేత్రం హైదరాబాద్ దగ్గరలో మంచి ప్రయాణ సౌకర్యాలను కలిగివుంది.


More Bhakti News